రైతాంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2022-12-13T00:01:35+05:30 IST

రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద రాష్ట వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సీపీఐ నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు.

రైతాంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర

కడప (సెవెన్‌రోడ్స్‌), డిసెంబరు 12 : రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద రాష్ట వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సీపీఐ నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో వ్యవసాయం దుర్లభంగా మారిందన్నారు. రైతు ఆత్మహత్యలను నివారిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన పాలకులు ఆచరణలో మాత్రం విఫలమయ్యారన్నారు. రైతు నెలసరి ఆదాయం రూ.9 వేలకు మాత్రమే పరిమితమైందన్నారు. ప్రతి రైతు 2 లక్షల రూపాయలకు పైగా అప్పుల భారాన్ని మోస్తున్నారన్నారు. దేశంలో ప్రతి 50 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్యకు గురవుతున్నాడన్నారు. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాధన్‌ సిఫార్సులను పాలక ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. దిగజారిపోతున్న వ ్యవసాయ రంగాన్ని మరింత ఊబిలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ సంస్కరణ బిల్లులను తెచ్చిందన్నారు. రైతు ప్రభుత్వమంటూనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సహకార రంగంలోని చక్కెర, స్పిన్నింగ్‌, పాడిరంగాల పునరుద్దరణ జరగలేదన్నారు. సహకార బ్యాంకులు, సొసైటీలను పటిష్టపరచకపోగా ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. మద్దతు ధరలు ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాధన్‌ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం అమలు చేయాలన్నారు. అప్పుల బారి నుండి రైతాంగాన్ని రక్షించాలన్నారు. ధాన్యాన్ని భూముల వద్దనే సేకరించి వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌ మీటర్లు బిగించే ప్రక్రియతోపాటు, విద్యుత్‌ బిల్లులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు క్రిష్ణమూర్తి, కె.ఆంజనేయులు, ఎంవీ సుబ్బారెడ్డి, బషీరున్నీసా, విజయలక్ష్మి, చంద్రశేఖర్‌, సుబ్రమణ్యం, కేసీ బాదుల్లా, ఎఐవైఎఫ్‌ గంగాసురేష్‌, మునెయ్య, మద్దిలేటి, బ్రహ్మం, వలరాజు, భాగ్యలక్ష్మి, యానాదయ్య, జయన్న, నారాయణ, పద్మ, పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:01:41+05:30 IST