బీటీ కళాశాల ప్రభుత్వపరం

ABN , First Publish Date - 2022-08-18T04:31:52+05:30 IST

ఐదేళ్లుగా పూర్వ విద్యార్థుల పోరాటం, 282 రోజులుగా ఏఐఎ్‌సఎఫ్‌ నాయకుల దీక్షలు వెరసి మదనపల్లె బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

బీటీ కళాశాల ప్రభుత్వపరం
ప్రభుత్వ పరమైన బీటీ కళాశాల

ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

ప్రత్యేకాధికారిగా ఆర్జేడీ నాగలింగారెడ్డి నియామకం


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 17: ఐదేళ్లుగా పూర్వ విద్యార్థుల పోరాటం, 282 రోజులుగా ఏఐఎ్‌సఎఫ్‌ నాయకుల దీక్షలు వెరసి మదనపల్లె బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. బుధవారం ఉన్నత విద్యాశాఖ (కొలిజియేట్‌) ఆర్జేడీ నాగలింగారెడ్డి బీటీ కళాశాల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీటీ కళాశాలను ఏడెకరాల ఆస్తులు, భవనాలతో పాటు అప్పగించేందుకు బీసెంట్‌ సెనెటరీ ట్రస్టు ముందుకు రావడంతో ప్రభుత్వపరం చేసేలా ప్రక్రియ ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఇంజనీర్లు, తాను పలుమార్లు బీటీ కళాశాలకు వచ్చి పరిస్థితులు, బీటీ కళాశాల సిబ్బంది వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. సుదీర్ఘంగా విద్యాశాఖ అధికారులు చర్చించాక బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసుకునేలా రాష్ట్ర కొలిజియేట్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. నేటి నుంచి ఈ కళాశాలను బీసెంట్‌ థియోసిఫికల్‌ ప్రభుత్వ కళాశాలగా పేరు మార్పు చేస్తున్నామన్నారు. అంతేకాక కళాశాలకు చెందిన భవనాలు, ఆస్తులు, కదిలించగల వస్తువులు అన్నీ ప్రభుత్వ పరం అయ్యాయన్నారు. ఎవరూ వీటిని కదిలించే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన తాను బీటీ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. కరస్పాండెంట్‌గా పనిచేసిన వైఎస్‌ మునిరత్నమయ్య, ప్రిన్సిపాల్‌ శివారెడ్డితో కలసి అడ్మిషన్లు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. కాగా బీటీ కళాశాలలో ఇప్పటి వరకు పనిచేసి బదిలీపై వేరే కళాశాలకు వెళ్లిన ఎయిడెడ్‌ ఉద్యోగులు (అధ్యాపకులు) తిరిగి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహించాలని ఉత్తర్వుల సారాంశం. ఇక్కడ పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని కూడా కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా బీటీ కళాశాల ప్రభుత్వపరం చేశారన్న విషయం తెలుసుకున్న ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు శివారెడ్డి, నవీన్‌ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.Read more