ఉత్సవాలకు ముస్తాబైన గణనాథుడు

ABN , First Publish Date - 2022-08-22T05:00:30+05:30 IST

గణేష్‌ ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబువుతున్నాడు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత గణేష్‌ ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్ని ప్రాంతాల యువకులు ఉవిళ్లూరుతున్నారు. జిల్లాలో ఈ ఉత్సవాల ఏర్పాట్లకు అప్పుడే ముమ్మరం చేస్తున్నారు.

ఉత్సవాలకు ముస్తాబైన గణనాథుడు
రాజంపేటలో ముస్తాబైన వినాయక విగ్రహాలు

భారీ ఎత్తున విగ్రహాలు సిద్ధం 

పదిరోజుల పాటు సందడే.. సందడి 

రాజంపేటటౌన్‌, ఆగస్టు 21: గణేష్‌ ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబువుతున్నాడు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత గణేష్‌ ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్ని ప్రాంతాల యువకులు ఉవిళ్లూరుతున్నారు. జిల్లాలో ఈ ఉత్సవాల ఏర్పాట్లకు అప్పుడే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కోడూరు, రాజంపేట, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో వేలాదిగా గణేష్‌ విగ్రహాలను ఏర్పాట్లు చేయడంలో మూడు నెలలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు లక్షకు పైబడి వినాయక విగ్రహాలు తయారైనట్లు సమాచారం. ఒక్కో విగ్రహం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్ముతున్నారు. కొన్ని విగ్రహాలు పూర్తిగా తయారు చేశారు. 90 శాతం విగ్రహాలకు పెయింట్లు కూడా పూర్తి చేశారు. ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో 50 నుంచి 200 వరకు, ఒక్కో మండల కేంద్రంలో 20 నుంచి 50 వరకు విగ్రహాలు పెట్టే అవకాశముంది. ప్రతి రోజూ అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా యువతీ, యువకులకు, విద్యార్థులకు వినాయక చవితి వచ్చిందంటే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. ఇదే పరిస్థితుల్లో ఈ ఉత్సవాల నిర్వహణకు జిల్లాలోని యువత అంతా పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ఏ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతాల్లో మంటపాలు వేసి, అలంకరణ చేసి వినాయకునికి ఉత్సవాలు నిర్వహించడానికి యువత సిద్ధమైంది. 


పెనగలూరులో: వినాయక చవితి పర్వదినం ఇంకా వారం పైబడి ఉన్నప్పటికీ గ్రామాలలో చవితి ఉత్సవాల సందడి అప్పుడే ప్రారంభమైంది. విగ్రహాలను ఏర్పాటు చేయబోయే వేదికలు, మంటపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ పాటికే సిద్ధంగా ఉన్న విగ్రహాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నారు. అలాగే అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను కూడా అంచనాలు వేసుకొని ఉన్నారు. మండలంలో మూడు, ఐదు రోజుల ఉత్సవాల నిర్వహణ కోసం నిధులు కూడా సిద్ధం చేసుకొని చవితి పండుగ కోసం ముఖ్యంగా యూత్‌ సభ్యులు ఎదురు చూస్తున్నారు. 


Updated Date - 2022-08-22T05:00:30+05:30 IST