రూ.3.47 కోట్ల నిధులు మాయం

ABN , First Publish Date - 2022-12-14T23:12:49+05:30 IST

ఉప ఖజానా శాఖాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆడిటర్‌ సాయంతో రూ.3.47 కోట్లు ప్రభుత్వ నిధులు మాయం చేశారు.

రూ.3.47 కోట్ల నిధులు మాయం

ఉప ఖజానా శాఖాధికారుల చేతివాటం

ఐదుగురిపై కేసునమోదు

మదనపల్లె క్రైం, డిసెంబరు 14: ఉప ఖజానా శాఖాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆడిటర్‌ సాయంతో రూ.3.47 కోట్లు ప్రభుత్వ నిధులు మాయం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆదాయ పన్ను శాఖాధికారి ఫిర్యాదు మేరకు ముగ్గురు అధికారులు సహా ఐదుగురిపై 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ప్రభుత్వానికి తప్పుడు ధ్రువపత్రాలిచ్చి బోగస్‌ క్లెయిమ్‌ల ద్వారా డబ్బు కాజేసిన అధికారులపై కేసు నమోదు చేశామన్నారు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ఉప ఖజానా శాఖాధికారులు శ్రీనివాసులు, బాలమురళి, ఇస్తియాజ్‌అలీలు ఈ మోసానికి పాల్పడ్డారన్నారు. మదనపల్లె పట్టణంలోని బర్మావీధికి చెందిన వైఎస్సార్‌ అండ్‌ కో సంస్థ ఆడిటర్‌ శ్రీనాథ్‌ సాయంతో తాము చెల్లించిన దానికన్నా రెట్టింపు ఆదాయపన్ను చెల్లించామని బోగస్‌ క్లయిమ్‌లు దాఖలు చేయించి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వెనక్కి తీసుకున్నట్లు ఇటీవల నిర్ధారణ కావడంతో తిరుపతి ఆదాయపన్నుశాఖ అధికారి రాజశేఖర్‌ మంగళవారం ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ముగ్గురు అధికారులు సహా ఆడిటర్‌ శ్రీనాథ్‌, ఆయన భార్య రమాదేవిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. తప్పుడు ధ్రువపత్రాలిచ్చి బోగస్‌ క్లయిమ్‌ల ద్వారా రూ.3.47 కోట్లు ప్రభుత్వ నిధులు కాజేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీఐ చెప్పారు.

Updated Date - 2022-12-14T23:12:51+05:30 IST