ధ్రువీకరణ పత్రాలకు.. దివ్యాంగుల పాట్లు

ABN , First Publish Date - 2022-10-02T04:35:39+05:30 IST

మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని సదరం క్యాంపులో కొంతకాలంగా మెంటలీ రిటార్డెడ్‌ సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థో, కంటి, ఈఎన్‌టీ బాధితులను పరీక్షించి సర్టిఫికె ట్లు జారీ చేస్తున్నా.. మెంటలీ రిటార్డెడ్‌ (ఎంఆర్‌) కు మాత్రం ఇక్కడి వైద్యురాలికి సర్టిఫికెట్‌ ఇచ్చే అనుమతి లేకపోవడంతో మంజూరు చేయడం లేదు.

ధ్రువీకరణ పత్రాలకు.. దివ్యాంగుల పాట్లు
సర్టిఫికెట్ల కోసం సదరం క్యాంపునకు వచ్చిన దివ్యాంగులు

ఎంఆర్‌ సర్టిఫికెట్లకు తప్పని ఇబ్బందులు   

మానసిక వైద్యురాలు అందుబాటులో ఉన్నా ఉపయోగమేదీ ?

చిత్తూరు, తిరుపతి ఆస్పత్రులకు పరుగులు   

ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు 


ప్రభుత్వం మంజూరు చేసే వికలత్వ ధ్రువీకరణ పత్రాల కోసం దివ్యాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా మెంటలీ రిటార్డెడ్‌ (ఎంఆర్‌) సర్టిఫికెట్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో సైక్రియాట్రిస్ట్‌ అందుబాటులో ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. దీంతో బాధితులు చిత్తూరు, తిరుపతి ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఎక్కడికి వెళ్లాలో తెలియక సదరం కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇచ్చిన గడువులో కేంద్రాలకు చేరుకోలేక.. సర్టిఫికెట్లు పొందలేక నరకయాతన అనుభవిస్తున్నారు. 


మదనపల్లె(క్రైం), అక్టోబరు 1: మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని సదరం క్యాంపులో కొంతకాలంగా మెంటలీ రిటార్డెడ్‌ సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థో, కంటి, ఈఎన్‌టీ బాధితులను పరీక్షించి సర్టిఫికె ట్లు జారీ చేస్తున్నా.. మెంటలీ రిటార్డెడ్‌ (ఎంఆర్‌) కు మాత్రం ఇక్కడి వైద్యురాలికి సర్టిఫికెట్‌ ఇచ్చే అనుమతి లేకపోవడంతో మంజూరు చేయడం లేదు. దీంతో కొందరు దివ్యాంగులు చిత్తూరు, తిరుపతి ఆసుపత్రులకు పరుగులు పెడుతుంటే... మరికొందరు ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాధారణంగా వైద్యులు ఇచ్చే వికలత్వ శాతాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారికి పింఛన్‌ మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలో మదనపల్లె డివిజన్‌లోని 11 మండలాల పరిఽధిలోని దివ్యాంగులు జిల్లా ఆస్పత్రిలోని సదరం క్యాంపులో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. కాగా దివ్యాంగులు తొలుత ఆయా ప్రాంత సచివాల యం, మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుం టే అక్కడి సిబ్బంది రిజిస్ర్టేషన్‌ చేసి స్లాట్‌ బుక్‌ చేస్తారు. ఈ క్రమంలో స్లాట్‌ బుక్‌ చేసుకు న్న తేదీన సదరం క్యాంపునకు వెళితే అక్కడి వైద్యులు వికలత్వాన్ని పరీక్షించి వికలత్వ శాతం తో కూడిన సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఇది ప్రభు త్వ నిబంధన. అయితే దివ్యాంగులతో పాటు ఒకరిద్దరు సహాయకులు వారి వెంట రావాల్సి ఉంది. వారంలో మంగళ, శుక్రవారాల్లో మాత్రమే ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డాక్టర్లు అందుబాటు లో ఉండి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తు న్నారు. కానీ స్లాట్‌ బుక్‌ చేసిన తేదీల్లో దివ్యాంగు లు రాలేకపోవడం, ఆలస్యంగా వస్తుండడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. వారంలో ఆ రెండు రోజులు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తుండగా, సమయానికి హాజరుకాని వారు మరో వారం రావాల్సి ఉంటుంది. సచివాలయం, మీ-సేవా కేంద్రాల సిబ్బంది స్లాట్‌ బుక్‌ చేసేటప్పుడు టైమింగ్‌ మధ్యాహ్నం 3, 4 గంటలకు అని అందులో నమోదు చేస్తున్నారు. దీంతో బాధితులు అదే టైమింగ్‌కు కేంద్రానికి వస్తుండడంతో ఆ సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండక వెనుదిరుగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో బాధితులు ఇంటికి వెళ్లిపోయి మరో వారం రావాల్సి ఉంది. సచివాలయం, మీ-సేవా కేంద్రాల సిబ్బంది తప్పిదం కారణంగానే ఈ సమస్య ఏర్పడుతోందని డాక్టర్లు అంటున్నారు. 

జిల్లా ఆస్పత్రిలో మానసిక వైద్యురాలు అందుబాటులో ఉన్నారు. కానీ ఆమెకు సర్టిఫికెట్లు జారీ చేసే అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఈ విషయం తెలియని వికలాంగులు పెద్దసంఖ్యలో మదనపల్లె కేంద్రానికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు చెందిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి సిబ్బంది విషయం చెబితే.. అప్పుడు ఆలస్యంగా తిరుపతి, చిత్తూరు కేంద్రాలకు వెళుతున్నారు. వీరు వెళ్లేసరికి అక్కడ సమయం మించిపోతోంది. దీంతో విధులు ముగించుకుని కేంద్రాలకు తాళం వేసి వెళ్లిపోతున్నారు. ఈ సమస్యతో ఎంఆర్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం రెండు మూడు వారాలు తిరగాల్సి వస్తోందని వారి సహాయకులు చెబుతున్నారు. కాగా ఇక్కడి వైద్యురాలికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఉపయోగం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మానసిక వైద్యురాలికి అనుమతి ఇవ్వాలంటూ ప్రజలు కోరుతున్నారు.


నివేదికలు పంపాం..

ఆస్పత్రిలో సైక్రియాట్రిస్ట్‌ అందుబాటులో ఉన్నా ఎంఆర్‌ బాధితులకు ఇబ్బందిగా ఉంది. మానసిక వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అనుమతి ఇక్కడి సైక్రియాట్రిస్ట్‌కు ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఈ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక.. మదనపల్లె క్యాంపులోనే సర్టిఫికెట్లు జారీ చేస్తాం.

- డాక్టర్‌ కె.ఆంజనేయులు, మెడికల్‌ సూపరింటెండెంట్‌, మదనపల్లె జిల్లా ఆస్పత్రి

Read more