వెలుగుల వ్యవసాయం

ABN , First Publish Date - 2022-12-06T23:30:54+05:30 IST

వ్యవసాయం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రైతులు పూలసాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఎల్‌ఈడీ లైట్ల వెలుగుతో చేపట్టే చామంతి సాగును తంబళ్లపల్లెలోనూ ప్రయోగాత్మకంగా చేపడుతున్నాడు ఓ రైతు.

వెలుగుల వ్యవసాయం
ఎల్‌ఈడీ లైట్లు అమర్చిన చామంతి తోట

ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో చామంతి సాగు

మొగ్గ రాకుండా కొమ్మలు పెరగడానికి తోటలో లైట్ల ఏర్పాటు

తంబళ్లపల్లెలో ప్రయోగాత్మకంగా చామంతి సాగు చేపట్టిన రైతు

వ్యవసాయం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రైతులు పూలసాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఎల్‌ఈడీ లైట్ల వెలుగుతో చేపట్టే చామంతి సాగును తంబళ్లపల్లెలోనూ ప్రయోగాత్మకంగా చేపడుతున్నాడు ఓ రైతు. చామంతి సాగులో మంచి పూల దిగుబడి సాధించడానికి తోటలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో కూడా పగటిలా ఉండేలా మొక్కలకు కృత్రిమ వెలుగునందిస్తున్నాడు. ఈ పద్ధతి ద్వారా మొక్కకు మొగ్గలు త్వరగా రాకుండా శాఖోత్పత్తి (కొమ్మలు) బాగా పెరిగి మంచి పూల దిగుబడి సాధించవచ్చునని రైతు చెబుతున్నాడు.

తంబళ్లపల్లె, డిసెంబరు 6: తంబళ్లపల్లె మండలం పరుసతోపు పంచాయతీ బాల్కోపల్లెకు చెందిన ఆదర్శ రైతు డి.కొండ్రెడ్డి వినూత్న పద్ధతిలో పూల సాగు చేపట్టాడు. గతంలో ఈయన ఎక్కువగా టమోటా పంటను సాగు చేసేవాడు. అయితే ప్రస్తుతం టమోటా లాటరీ పంట కావడంతో ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూశాడు. దీంతో పంట మార్పిడి చేయాలని వినూత్నంగా ఆలోచించిన ఆయన పూల సాగు వైపు దృష్టి సారించాడు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో సాగు చేస్తున్న వివిధ జాతులకు చెందిన చామంతి తోటల వద్దకు వెళ్లి పరిశీలించాడు. ఇక్కడి ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములు, వాతావరణానికి తగ్గట్టుగా మంచి పూల దిగుబడినిచ్చే అనువైన రకాలు, సాగులో మెలకువలను ఆ ప్రాంత రైతుల నుంచి వివరంగా తెలుసుకున్నాడు. వెంటనే కర్ణాటక రాష్ట్రం హెచ్‌ క్రాస్‌ నుంచి సెంటిల్‌ రకానికి చెందిన కలకత్తా చామంతి నారును ఒక్కో మొక్క మూడు రూపాయలతో కొనుగోలు చేశాడు. గ్రామంలో తన రెండెకరాల పొలంలో పదిహేను రోజుల కిందట ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాడు. ఎకరాకు సుమారు 17 వేల మొక్కలు చొప్పున, రెండెకరాలకు కలిపి 34 వేల మొక్కలు (మొక్కకు, మొక్కకు మధ్య ఒకటిన్నర అడుగు) నాటాడు. మధ్యలో గడ్డి రాకుండా భూమిపై మల్చింగ్‌ కవరు పరచి, డ్రిప్‌ ద్వారా నీరు అందిస్తున్నాడు. మొక్క నాటిన పదిహేను రోజుల తర్వాత తోటలో సాళ్ల మధ్యలో 15 అడుగుల దూరంలో వి ఆకారంలో రెండు ఎండిన కర్రలు పాతి ఎల్‌ఈడీ (50 వాట్స్‌) బల్బులను, రెండెకరాలకు కలిపి 60 వరకూ అమర్చాడు. చీకటి పడగానే లైట్లు వేసి ఉదయం వెలుతురు రాగానే లైట్లు ఆఫ్‌ చేస్తున్నాడు. చామంతి మొక్కకు రాత్రి పూట వెలుగును అందిస్తే మొగ్గ త్వరగా పట్టకుండా శాఖలు (కొమ్మలు) బాగా పెరిగి మంచి పూల దిగుబడి వస్తుందని రైతు అంటున్నాడు. రెండెకరాల సాగుకు దున్నడం, నారు, కూలీలు, ఎరువులు, మల్చింగ్‌ పేపరు, బల్బులు అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు వస్తుందని రైతు చెబుతున్నాడు. మొక్క నాటిన రెండున్నర నెలల తర్వాత పూలు శ్యాంపుల్‌ కటింగ్‌ వస్తుందని, మూడు నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతాయని తెలిపారు. పంట సక్సెస్‌ అయితే రెండెకరాలకు కలిపి సుమారు 15 నుంచి 20 టన్నుల వరకూ పూల దిగుబడి వస్తుందంటున్నాడు. మార్కెట్లో ఒక్కో పువ్వు కనీసం రూ.2 నుంచి రూ.5 వరకూ ఉంటుందని, కిలో అయితే (మార్కెట్లో ఉన్న డిమాండ్‌, పూల నాణ్యత, సీజన్‌)ను బట్టి కిలో రూ.150 నుంచి రూ.400 వరకు ధర పలుకుతాయని చెబుతున్నాడు. పూలు కటింగ్‌ చేసిన వెంటనే తాజాగా ఏరోజుకారోజు సంచిలో వేసి కర్ణాటక, తమిళనాడు వంటి పట్టణాలలో ఉన్న మార్కెట్‌కు ఎగుమతి చేయాల్సి ఉంటుందన్నారు. మొక్క నాటిన యాభై రోజుల అనంతరం కొమ్మలు ఎక్కువగా వచ్చిన తర్వాత లైట్లను తీసివేయాలని రైతు చెబుతున్నాడు.

ఎల్‌ఈడీ లైట్లు లేకుండా కూడా సాగు చేయొచ్చు

సెంటిల్‌ రకానికి చెందిన కలకత్తా చామంతి మొక్కలను రాత్రి పూట వెలుతురు (ఎల్‌ఈడీ లైట్లు) లేకుండా కూడా సాగు చేయవచ్చని రైతు చెబుతున్నాడు. అయితే ఈ పద్ధతి వలన మొక్క గుబురుగా పెరగదని, నాటిన 50 రోజులకే మొగ్గ పట్టి పూలు త్వరగా పూయడం ప్రారంభిస్తుందన్నారు. దీని వలన పూల దిగుబడి చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నాడు.

ఒక్క నాటుతో...రెండు పంటలు

చామంతి సాగులో సరైన మెలకువలు పాటించి సస్యరక్షణ చర్యలు చేపడితే ఒక్క నాటుతో రెండు పంటలు తీయవచ్చని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం నవంబరు చివర్లో సాగు చేసిన పంట మూడు నెలల పెరుగుదల అనంతరం మరో మూడు నెలల పాటు పూల దిగుబడినిస్తుంది. పూలు పూర్తయిన అనంతరం జూన్‌-జూలై మాసాల్లో మొక్క కొమ్మలను కత్తిరించి, సరిగ్గా నీరు, మంచి ఎరువులు అందించాలి. దీంతో మొక్క మళ్లీ చిగురించి నూతన కొమ్మలు ఏర్పడి మంచి పూల దిగుబడి వస్తుందని చెబుతున్నాడు.

మంచి దిగుబడి వస్తుందని అనుకుంటున్నా

-డి.కొండ్రెడ్డి, రైతు, బాల్కోపల్లె

నేను టమోటాను ఎక్కువగా సాగు చేస్తాను. అయితే, పంట మార్పిడి చేయాలని వినూత్నంగా ఆలోచించి కర్ణాటక రాష్ట్రంలో ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో ఎక్కువగా సాగు చేసే చామంతిని మన ప్రాంతంలో సాగు చేద్దామని అనుకున్నా. అక్కడ తోటలను స్వయంగా పరిశీలించి సాగుకయ్యే ఖర్చు, వచ్చే పూల దిగుబడి, ఆదాయం గురించి అ ప్రాంత రైతులను అడిగి తెలుసుకున్నా. వెంటనే చామంతి సాగును మన ప్రాంతంలో రెండెకరాలలో ప్రయోగాత్మకంగా సాగు చేశా. పంట సక్సెస్‌ అయితే రెండెకరాలకు కలిపి ఇంచుమించు 20 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నాను.

Updated Date - 2022-12-06T23:30:57+05:30 IST