తుఫాన్‌ ధాటికి రైతులు విలవిల

ABN , First Publish Date - 2022-12-13T00:17:19+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ధాటికి మండలంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో ఎక్కువ శాతం రైతులు ఉద్యాన పంటలపై అధారపడతారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి పంటలు ఎక్కువ పండుతాయి.

తుఫాన్‌ ధాటికి రైతులు విలవిల
చెరువును తలపిస్తున్న అరటి తోటలు

రైల్వేకోడూరు(రూరల్‌), డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ధాటికి మండలంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో ఎక్కువ శాతం రైతులు ఉద్యాన పంటలపై అధారపడతారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి పంటలు ఎక్కువ పండుతాయి. తుఫాన్‌ దాటికి అరటి రైతులకు అపారనష్టం వాటిల్లింది. మండలంలోని ఎస్‌.ఉప్పరపల్లి పంచాయతీలో 25 ఎకరాలు, శెట్టిగుంట పంచాయతీ లక్ష్మిగారిపల్లెలో 25 ఎకరాలు, చియ్యవరం పంచాయతీలో సుమారు 10 ఎకరాలు అరటి పంట నాశనమైందని ఉద్యానశాఖ అధికారి ఆసియా తెలిపారు. మండలంలోని మరికొన్ని పంచాయతీలో పంటపొలాలు చెరువులా తలపిస్తున్నాయి. దెబ్బతిన్న పంటలను ఉద్యానశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులతో వెళ్లి పరిశీలించారు. ప్రాఽథమికంగా ఇప్పటివరకు 60 ఎకరాల అరటితోటలు ధ్వంసమైనట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటలు దిబ్బతిన్నట్లయితే తక్షణం స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మాండస్‌ తుఫాన్‌ దాటికి ఈ ఏడాది మామిడి రైతులకు తీవ్ర నష్టం తప్పదని విశ్లేషకులు తెలిపారు. బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

అన్నదాతను మింగిన మాండస్‌

చిట్వేలి, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ తగ్గిందని ఊపిరి పీల్చుకున్న రైతన్నలకు మళ్లీ మొదలైన వర్షాలు రైతన్న గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలో నాగవరం 20, సీఎంరాజుపల్లె 10, నేతివారిపల్లె మహరాజపురం 10, మైలపల్లె 5, పంచాయతీలలో మొత్తం 45 ఎకరాలలో అరటి పంట పడిపోగా, ఉద్యానశాఖ అధికారిణి అయేషా సోమవారం అరటి పంటలను పరిశీలించారు. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ సీజన్‌లో బొప్పాయి తోటల్లో ఇటీవల నాటిన చిన్న బొప్పాయి మొక్కలు నీటి నిల్వ ఉండడంతో దాదాపు మండల వ్యాప్తంగా 4 వేల బొప్పాయి మొక్కలు కుళ్లిపోయాయి. మరల మొక్కలు నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న యల్లంరాజు చెరువు గొట్టుమానుకోన రిజర్వాయర్‌ వరదనీరు చేరి నిండుకుండలా ఉంది.

Updated Date - 2022-12-13T00:17:20+05:30 IST