సూట్‌ వదల్లేదు..!

ABN , First Publish Date - 2022-08-04T05:30:00+05:30 IST

పులివెందుల ప్రాంతం చీనీ పంటకు పెట్టింది పేరు. వేల ఎకరాల్లో చీనీ సాగులో ఉంది. చీనీ పంట పండిన సమయంలో వ్యాపారులు సూట్‌ పేరుతో రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. గత మూడేళ్ల క్రితం వరకు పది టన్నులకు రెండు టన్నులు సూట్‌గా తీసేసి 8 టన్నులకు మాత్రమే డబ్బు ఇస్తూ వచ్చారు. అది కాస్త రెండు మూడు సంవత్సరాలుగా రెండున్నర టన్నులుగా నిర్ణయించారు.

సూట్‌ వదల్లేదు..!
రేకుల షెడ్డులో కొనసాగుతున్న పులివెందుల మార్కెట్‌యార్డ్‌

- పులివెందుల మార్కెట్‌ యార్డులో..

- సూట్‌ లేకుండా కొనుగోళ్లంటూ ఆర్భాటం

- ప్రచారం కల్పించని అధికారులు

- విక్రయించేందుకు ముందుకు రాని రైతులు 

- మూణ్నాళ్ల ముచ్చటగా చీనీ కొనుగోళ్లు


చీనీ రైతులను ఆదుకుంటామని, సూట్‌ లేకుండా కొనుగోళ్లు సాగిస్తామని అన్నారు. ఆర్భాటంగా కొనుగోళ్లు ప్రారంభించారు. దీనికి సంబంధించి అవగాహన కల్పించక పోవడంతో రైతులు ఇక్కడకు చీనీకాయలు తీసుకురాలేదు. దీంతో పులివెందుల మార్కెట్‌యార్డులో సూట్‌లేకుండా కొనుగోళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. పులివెందుల మార్కెట్‌ యార్డు ఉండీ లేనట్టయింది. దీంతో రైతులు పది టన్నులకు రెండున్నర టన్నుల చీనీకాయలను వ్యాపారులకు సూట్‌ పేరుతో సమర్పించుకోక తప్పడం లేదు.


పులివెందుల, ఆగస్టు 4: పులివెందుల ప్రాంతం చీనీ పంటకు పెట్టింది పేరు. వేల ఎకరాల్లో చీనీ సాగులో ఉంది. చీనీ పంట పండిన సమయంలో వ్యాపారులు సూట్‌ పేరుతో రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. గత మూడేళ్ల క్రితం వరకు పది టన్నులకు రెండు టన్నులు సూట్‌గా తీసేసి 8 టన్నులకు మాత్రమే డబ్బు ఇస్తూ వచ్చారు. అది కాస్త రెండు మూడు సంవత్సరాలుగా రెండున్నర టన్నులుగా నిర్ణయించారు. టన్ను చీనీకాయల ధర రూ.20వేలు ఉన్నా, రూ.50వేలు ఉన్నా, రూ.80వేలు ఉన్నా ఈ సూట్‌ మాత్రం తప్పదు. ప్రతి పది టన్నులకు రెండున్నర టన్నుల చీనీకాయలు వ్యాపారులకు వదిలేయాల్సిందే.


ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

పులివెందుల ప్రాంతంలో దాదాపు 25వేల హెక్టార్లలో చీనీసాగులో ఉంది. 18వేల నుంచి 20వేల హెక్టార్లలో చీనీ పంట దిగుబడి వస్తోంది. పులివెందుల చీనీ తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే చీనీకాయలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని, నాణ్యత కూడా బాగుంటాయని పేరు. అందుకే ఇక్కడి చీనీ పంటకు పక్క రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంటుంది. కానీ వ్యాపారులు మాత్రం చీనీ రైతును సూట్‌ పేరుతో నిలువునా ముంచుతున్నారు. 


ఆర్భాటంగా ప్రారంభించినా..

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పులివెందుల మార్కెట్‌ యార్డు ఘనంగా ప్రకటించింది. సూట్‌ లేని కొనుగోళ్లు సాగిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన ఆర్భాటంగా కొనుగోళ్లు ప్రారంభించారు. మొదటి రోజు కేవలం దాదాపు మూడు టన్నుల చీనీకాయలను కొన్నారు. అప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ కొనుగోళ్లు సాగాయి. నెలరోజులు కూడా చెప్పుకొనే స్థాయిలో కొనుగోళ్లు సాగలేదు. సూట్‌ లేకుండా కొనుగోళ్లు చేస్తామని అవగాహన కల్పించకపోవడంతో మార్కెట్‌ యార్డులో చీనీకాయలు విక్రయించేందుకు రైతులు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడ కొనుగోళ్ల్లు ఆగిపోయాయి. సూట్‌లేని వ్యాపారం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది.


అవగాహన కల్పించడంలో విఫలం

సాధారణంగా చీనీ తోటల వద్దకు వ్యాపారులే కూలీలను, వాహనం తీసుకుని వెళుతుంటారు. కూలి, బాడుగ రైతులే ఇస్తారు. మార్కెట్‌లో టన్ను రూ.20వేలు ఉంటే 10 టన్నులకు రెండున్నర టన్నుల సూట్‌ తీసేసి మిగిలినవి టన్ను రూ.22వేల చొప్పున తోటల వద్ద వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ విధానానికి రైతులు పూర్తిగా అలవాటు పడడంతో చాలామంది తోటలవద్దే అమ్మేస్తున్నారు. దీంతో వీరు భారీగా నష్టపోతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా అధికారులు రైతులకు వివరించి ఉంటే మార్కెట్‌యార్డులో కొనుగోళ్లు ఆగిపోయేవి కావు. 


వసతులు లేకనే..

పులివెందుల మార్కెట్‌యార్డులో సరైన వసతులు లేవు. వ్యాపారులు ఉండేందుకు గదులు లేవు. రేకుల షెడ్డులో మార్కెట్‌యార్డు కొనసాగుతోంది. దీంతో ఇక్కడ వ్యాపారులు ఎక్కువగా ఉండరని, ఉన్నా వారంతా సిండికేట్‌ అయి ధర తగ్గిస్తారనే కారణంతో కూడా రైతులు ఇక్కడకు రావడం లేదు. చాలామంది తోటలవద్దే అమ్ముతుంటే.. కొంతమంది రైతులు అనంతపురం మార్కెట్‌యార్డుకు చీనీకాయలను తీసుకుని పోతున్నారు. అక్కడికి రైతులే కాకుండా చిన్నచిన్న వ్యాపారులు కూడా చీనీ పంటను తీసుకురావడంతో అక్కడి మార్కెట్‌ పూర్తిస్థాయిలో సాగుతోంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పాపాఘ్ని పొంగుతుండడంతో అనంతపురం జిల్లాకు రాకపోకలు బంద్‌ అయ్యి పులివెందుల ప్రాంత చీనీ రైతులు ఇబ్బంది పడు తున్నారు. అదే పులివెందుల మార్కెట్‌యార్డులో కొనుగోళ్లు సాగుతుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పటికైనా మార్కెట్‌యార్డులో పూర్తిస్థాయిలో వసతులు కల్పించడంతో పాటు, సూట్‌లేకుండా కొనుగోళ్లు చేస్తామనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. తద్వారా రైతులు నష్టపోకుండా ఉంటారు.


సీజన్‌ ప్రారంభం కాగానే మళ్లీ కొనుగోళ్లు

- రత్నరాజు, ఇన్చార్జి మార్కెట్‌యార్డు కార్యదర్శి, పులివెందుల

చీనీ పంటకు మరో వారం పది రోజుల్లో సీజన్‌ మొదలవుతుంది. మళ్లీ మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు మొదలుపెడతాం. ఏప్రిల్‌లో సూట్‌ లేకుండా ఇక్కడ కొనుగోళ్లు మొదలుపెట్టాం. సీజన్‌ లేక పోవడంతో కొనడం ఆపేశాం. వ్యాపారులు ఉండేందుకు ఇక్కడ గదులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. 20 గదులను ఏర్పాటు చేస్తున్నాం. రైతుల్లో అవగాహన లేక నాణ్యతగా ఉన్న పంటను వ్యాపారులకు అమ్మేసి, నాణ్యత లేని పంట ఇక్కడకు తెస్తున్నారు. దీంతో ఇక్కడ అనుకున్న స్థాయిలో కొనుగోళ్లు సాగలేదు. పూర్తిస్థాయిలో కొనుగోళ్లు సాగించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులకు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం.



Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST