మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2022-11-24T23:41:18+05:30 IST

పిల్లలపై ప్రేమతో ఎంతో మంది తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి పిల్లలను వారే ప్రమాదంలోకి నెడుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

చిన్నారులను ప్రమాదాల్లోకి నెడుతున్న తల్లిదండ్రులు

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

రాయచోటి టౌన్‌, నవంబరు 24: పిల్లలపై ప్రేమతో ఎంతో మంది తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి పిల్లలను వారే ప్రమాదంలోకి నెడుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడిపినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా అది చట్టరీత్యా నేరమన్నారు. ప్రమాదమనేది ఏ రూపంలో ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని, తల్లిదండ్రులు అజాగ్రత్త, నిర్లక్ష్యంతో తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. క్షణికానందం కోసం మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ట్రాఫిక్‌ నిబంధనలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో ఎక్కువ భాగం మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై స్పెసల్‌ డ్రైవ్‌తో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు వాహన యజమానికి జరిమానా విధించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఒక్కసారి వారి విలువైన ప్రాణాల గురించి ఆలోచించాలని తెలిపారు.

Updated Date - 2022-11-24T23:41:30+05:30 IST

Read more