నిర్వాసితులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-08-02T04:24:21+05:30 IST

ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలదే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ స్పష్టం చేశారు.

నిర్వాసితులకు న్యాయం చేయండి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్‌

నమ్ముకున్న ప్రజలకు అన్యాయం చేయొద్దు

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్‌


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 1: ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలదే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లెలోని టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో పర్వీన్‌తాజ్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు వద్ద వైసీపీ ప్రభుత్వం రూ.776 కోట్లతో 2 టీఎంసీల సామర్థ్యం గల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నిరభ్యంతరంగా ఆరు నెలల నుంచి పనులు చేస్తున్నారన్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దిగువశీతివారిపల్లె, దిన్నెమీదపల్లె, కొత్తపల్లె గ్రామాలు నీటమునిగిపోతున్నాయన్నారు. దీంతో పాటు 195 మంది రైతులకు చెందిన 876 ఎకరాల భూమి సేకరణ చేసినా ఇంతవరకు రైతులకు రావాల్సిన రూ.150.25 కోట్ల పరిహారం చెల్లించలేదన్నారు. దీనిపై ప్రశ్నించే రైతులు పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలియజేయాలన్నారు. మూడు ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం ఎప్పుడు కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆదరించిన ప్రజలకు అండగా ఎప్పుడు నిలుస్తారని ప్రశ్నించారు. ఇక్కడి రైతుల బాధ్యత పెద్దిరెడ్డి కుటుంబీకులదే అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేయకుంటే టీడీపీ తరపున తామంతా పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి వై.దొరస్వామినాయుడు, అరుణ్‌తేజ్‌, ప్రభాకర్‌, మదార్‌వలి, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more