నేతన్న నేస్తానికి తూట్లు..
ABN , First Publish Date - 2022-08-04T05:51:29+05:30 IST
వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాజంపేట, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లో చేనేత కార్మికులున్నారు. చేతిమగ్గం కంటే మరమగ్గాలు నేసే కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారు. కానీ చేతిమగ్గం నేసే
నిబంధనల పేర అర్హుల తొలగింపు
మొదటి విడతలో 11,948 మందికి సాయం
మూడో విడతలో 2881 మందికి కోత
నాలుగోవిడతలో ఇంకెందరికి ఆపుతారో..?
ఆవేదన వ్యక్తం చేస్తున్న నేతన్నలు
అనారోగ్యం, వృద్ధాప్యంతో పనిచేయలేని కార్మికులు
రోజంతా మగ్గంగుంత వద్ద కూర్చుని కాలు చేయి కదిలించి.. పోగు పోగు అతుక్కుంటేనే చేనేతల జీవనం సాగేది. వీరి శ్రమ ఎక్కువ ఆదాయం అంతంత మాత్రమే కావడంతో చాలామంది పేదరికంలో మగ్గుతున్నారు. అప్పులు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం ఏడాదికి ఒకసారి అందిస్తున్న రూ.24 వేల నేతన్న నేస్తం సాయం కొంత ఊరటనిస్తోంది. 2019 నుంచి ఇప్పటికి మూడు దఫాలుగా సాయం అందించింది. అయితే ఏడాదికేడాది లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతోంది. పఽథకం ప్రారంభంలో లేని నిబంధనలు ప్రతి ఏడాది పెరుగుతూ నేతన్న నేస్తాన్ని చాలామందికి దూరం చేశారు. దీంతో మగ్గంపైనే బతుకుతున్న వితంతువులు, పేద నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రొద్దుటూరు (అర్బన్), ఆగస్టు 3: వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాజంపేట, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లో చేనేత కార్మికులున్నారు. చేతిమగ్గం కంటే మరమగ్గాలు నేసే కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారు. కానీ చేతిమగ్గం నేసే కార్మికునికి మాత్రమే నేతన్న నేస్తం సాయం ప్రభుత్వం అందిస్తోంది. అది కూడా కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ ఒక్కదానిపైనే ఆర్థిక సాయం అందుతుంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 11,948 మంది చేనేతలను అర్హులుగా గుర్తించి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం అందించారు. రెండోసారి 2020- 2021 సంవత్సరానికి 9,311 మందికి ఇచ్చారు. అంటే మొదటి దఫాతో పోలిస్తే 2,637 మందికి కోత వేశారు. మూడో దఫా 2021 -2022 సంవత్సరానికి 9,064 మందికి మాత్రమే లబ్ధి కల్పించారు. మొదటి దఫాతో పోలిస్తే మూడో దఫాకు 2,884 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఈనెల విడుదల చేసే నాలుగో విడత సాయంలో ఇంకెంతమంది అనర్హుల జాబితాలో చేరతారో అని చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం గుంత మగ్గం నేసే కార్మికులు కేవలం 9వేలు మాత్రమే ఉన్నట్టు చూపుతున్నారు.
నిబంధనల పేర తొలగింపు
చేనేత కార్మికులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటివారు కొంతకాలం మగ్గం నేయలేకపోతే ఏకంగా వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. సచివాలయ సిబ్బంది వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు మగ్గంగుంతలో నేస్తూ లేరంటూ కోతలు పెట్టడంపై కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యం మీద పడి, కుటుంబం నుంచి ఎవ్వరూ సాయం లేక శక్తి మేరకు పడుగు పేక తెచ్చుకుని నేస్తున్న వారిని సైతం అనర్హులుగా గుర్తించారనే ఆరోపణలున్నాయి. మార్కెట్లో చేనేత వస్త్రాలకు గిరాకి తగ్గి వ్యాపారం లేక చేనేత కార్మికుడికి మాస్టర్ వీవర్స్ పడుగు పేక ఇవ్వక పోవడంతో పనులులేక మగ్గం నేయకున్నా అనర్హులంటూ తొలగిస్తున్నారు. మరి కొందరు మగ్గంలో వచ్చే ఆదాయం కుటుంబపోషణకు చాలక అదనపు పనులు చేస్తున్నారు. ఇతర ఆదాయాలు సంపాదిస్తున్నారంటూ వీరిని సైతం అనర్హులుగా ప్రకటించారు.
అనర్హులకు నేతన్న నేస్తం..?
వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఈ నెలలో నాలుగోసారి లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిఽక సాయంచేయనుంది. ఈ తరుణంలో కొందరు అనర్హులను ఈ పఽథకానికి ఎంపిక చేయడానికిఅధికార పార్టీ నేతలు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం సచివాయ సిబ్బందికి, దళారులకు కొంత వాటా ఇచ్చేలా బేరాలు సాగుతున్నాయనే విమర్శలున్నాయి. గతంలోనూ కొందరు సచివాయ సిబ్బందిపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. మరమగ్గాలు ఉన్నవారికి కూడా గతంలో ఈ పథకం కింద కొన్నిచోట్ల సాయం అందినట్లు ఆరోపణలున్నాయి. త్వరలో అందనున్న నాలుగోవిడత నేతన్న నేస్తంలో ఎంతమంది పేర్లు అర్హుల పేర్లు ఎగిరిపోతాయో అని నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.
కాళ్లకు బొబ్బలు వచ్చి మగ్గం నేయలేక పోయా
- ఆరవేటి గౌరి(58), ప్రొద్దుటూరు
14 ఏళ్ల వయస్సు నుంచి మగ్గం నేస్తున్నా. నా భర్త చనిపోయి 13 ఏళ్లయింది. ముగ్గురు ఆడపిల్లలను ఒక కొడుకును సాక్కున్నా. నేతన్న నేస్తం మూడు దఫాలుగా వచ్చింది. షుగర్ వ్యాధితో కాళ్లకు బొబ్బలొచ్చి డాక్టర్ సలహా మేరకుకొద్ది రోజులు మగ్గం నేయలేదు. మగ్గం నేయడం లేదని చెప్పి నన్ను అనర్హురాలిగా సచివాలయ సిబ్బంది నివేదిక పంపారు. దీంతో నాకు వస్తున్న నేతన్న నేస్తం తీసేశారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా..
భర్త, కొడుకు పోయిన ఒంటరిదాన్ని
- చౌడం నీలావతి (57), హనుమాన్ నగర్, ప్రొద్దుటూరు
30 ఏళ్లుగా భర్తతో కలిసి మగ్గం నేస్తున్నా. సంవత్సరం క్రితం మా కొడుకు అనారోగ్యంతో మరణించాడు. 6నెలల క్రితం భర్త మరణించాడు. దీంతో ఒంటరిగా మగ్గం నేస్తూ జీవిస్తున్నా. నాకు నిన్నటి వరకు వితంతు పెన్షన్ కూడా రాలేదు. మూడేళ్లుగా నేతన్న నేస్తం వచ్చింది. సచివాలయ సిబ్బంది పరిశీలనకు వచ్చినప్పుడునేను మగ్గం నేస్తూలేనని చెప్పి అనర్హురాలిగా ప్రకటించారు. భర్త, కొడుకు ఇద్దరూ చనిపోతే ప్రభత్వం నుంచి పైసా బీమా రాలేదు. ఇప్పుడు మగ్గం లెక్క కూడా తీసేస్తే నేనెలా బతకాలి.
నా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు
- బండి లక్ష్మీదేవి, హనుమాన్‌నగర్, ప్రొద్దుటూరు
గత 15 ఏళ్లుగా భార్యభర్తలం మగ్గం నేస్తున్నాం. మగ్గంలో వచ్చే ఆదాయం చాలక అప్పులు తీర్చుకోవడానికి అదనంగా మిషను కుడుతున్నా. నా భర్త కూడా మగ్గంలేని సమయంలో ఇతర కూలి పనులు చేస్తుంటాడు. ఈ పనులు చేస్తున్నామని చెప్పి మాకు సచివాలయ సిబ్బంది నేతన్న నేస్తం తొలగించారు. మూడేళ్లుగా కొంత ఆసరా ఉంటున్న నేతన్న నేస్తం డబ్బులు రావని తెలిసి నా భర్త అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ వారు కరుణించక పోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తప్పుడు నివేదికలతో తొలగిస్తున్నారు
- చెన్నా లోకేశ్, చేనేత కార్మికుడు, హనుమాన్‌నగర్, ప్రొద్దుటూరు
సచివాలయ సిబ్బంది ఎంక్వైరీకి వచ్చినప్పుడు మేము ఊర్లో లేము. మగ్గం మూసిపెట్టి ఊరెళ్లాము. మూసి పెట్టిన మగ్గం పొటోలు తీసి మగ్గం నేయడం లేదంటూ తప్పుడు నివేదికలు ఇచ్చి చేనేతల కడుపు కొడుతున్నారు. ప్రభుత్వం మూడేళ్లుగా అందిస్తున్న నేతన్న నేస్తం తొలగించడం దారుణం.
వెరిఫికేషన్ పూర్తి కాలేదు
- రంగస్వామి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్
ఇంకా సచివాలయాల పరిధిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పుడు ఎన్ని తొలగించారో, ఎందరిని అనర్హులుగా గుర్తించారోపూర్తి సమాచారం ఇప్పుడే తెలీదు. నిబంధనల మేరకు అర్హులను గుర్తిస్తున్నారు.