దాల్మియా యాజమాన్యం రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-07-19T05:05:48+05:30 IST

దాల్మియా యాజమాన్యం చుట్టుపక్కల గ్రామాల రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

దాల్మియా యాజమాన్యం రైతులను ఆదుకోవాలి
జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేస్తున్న దాల్మియా బాధిత రైతాంగం, పక్కనే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి


జమ్మలమడుగు రూరల్‌, జూలై 18: దాల్మియా యాజమాన్యం చుట్టుపక్కల గ్రామాల రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీ బాధిత రైతులతో కలసి ఆయన ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీ కాంపౌండ్‌ పక్కన  300 మీటర్ల దూరంలో వరదనీరు పంట పొలాల్లో ప్రవహించి తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోకుండా  దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీ  నిర్మాణం చేపట్టారన్నారు. వర్షాలు కురిస్తే తలమంచిపట్నం, తిమ్మనాయునిపేట, పై గ్రామాల నుంచి వరదనీరు ప్రవహించి నేరుగా బుగ్గనపల్లె పొలాల్లో నుంచి ఫ్యాక్టరీలో పడి పోయేదన్నారు. వంకలపై నిర్మాణం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడంతో   రైతుల నష్టపోతున్నారన్నారు. అనంతరం మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ బుగ్గనపల్లె గ్రామంలో 1, 2 ఎకరాలు కలిగిన ఎస్సీ రైతులు  వ్యవసాయంపై ఆధారడి జీవనం సాగిస్తున్నారన్నారు. ఫ్యాక్టరీ పక్కన వ్యర్థాలు, సిమెంటు డస్ట్‌ పొలాలపై పడి పంటలు సక్రమంగా పండక నష్టపోవడమే కాకుండా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌ ద్వారా పరిశీలించి... వరదనీటితో ఇబ్బంది పడుతున్న రైతు లను దాల్మియా యాజమాన్యం ఆదుకోవాలన్నారు. అలాగే దాల్మియా యాజమాన్యం ట్రక్‌ లోడింగ్‌లో స్థానికులకు అవకాశం కల్పించడం లేదన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యం ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులకే ట్రక్‌ లోడింగ్‌లో అవకాశం ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. ఇందుకు స్పందించిన ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ దాల్మియా యాజమాన్యానికి నోటీసు అందించి... రైతు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, కర్ణాటి రామాంజనేయరెడ్డి, బుగ్గనపల్లె, నవాబుపేట రైతులు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-19T05:05:48+05:30 IST