కరెంట్‌.. కట్‌ కట్‌

ABN , First Publish Date - 2022-04-22T07:41:51+05:30 IST

పట్టణం, మండలం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కరెంట్‌ కోతలే.. ఈ కోతలు విద్యార్థుల భవితపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది పబ్లిక్‌ పరీక్షల కాలం. ఈ నెల 27 నుంచి పదో తరగతి, వచ్చే నెలలో డిగ్రీ, ఇంటర్‌ పరీక్షలు మొదలు కానున్నాయి. ఏడాదంతా

కరెంట్‌.. కట్‌ కట్‌

ఇష్టారాజ్యంగా విద్యుత్‌ కోతలు

పరీక్షల సమయంలో విద్యార్థుల అవస్థలు

ఆందోళనలో తల్లిదండ్రులు


అసలే ఎండాకాలం.. మండుతున్న ఎండలు... ఉక్కపోత.. ఇంటికెళ్లి కాస్త సేదతీరుదామంటే కరెంటు కోతలు.. దీంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు నానా అవస్థలు పడుతున్నారు. ఇక విద్యార్థుల బాధ వర్ణనాతీతం.. అసలే పరీక్షల సమయం... ఎప్పుడు కరెంటు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. బయట భగ భగ మండే ఉష్ణోగ్రతలు. ఇంట్లో కరెంట్‌ కోతలు. దీంతో చదువుపై ఏకాగ్రత సారించలేకపోతున్నారు. త్వరలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానుండడంతో పిల్లల భవిష్యత్‌ ఏమవుతోందనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


కడప(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 21 : పట్టణం, మండలం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని  ప్రాంతాల్లో కరెంట్‌ కోతలే.. ఈ కోతలు విద్యార్థుల భవితపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది పబ్లిక్‌ పరీక్షల కాలం. ఈ నెల 27 నుంచి పదో తరగతి, వచ్చే నెలలో డిగ్రీ, ఇంటర్‌ పరీక్షలు మొదలు కానున్నాయి. ఏడాదంతా చదవి పరీక్షల్లో బాగా రాస్తేనే వారి బంగారు భవితకు పునాది పడేది. బాగా రాయాలంటే రాత్రనకా, పగలనకా కష్టపడి చదవాలి. అయితే చదివేందుకు విద్యార్థులకు సరైన వాతావరణం లేదు.  అసలే ఎండాకాలం కావడంతో మండుతున్న ఉష్ణోగ్రతలు. ఇంట్లో కరెంట్‌ కోతలు. ఇన్ని అసౌకర్యాల మధ్య ఏకాగ్రతగా చదవలేకపోతున్నారు. విద్యార్థులు ఏకాగ్రతగా చదువుకోవాలంటే రాత్రి లేక తెల్లవారుజామునే అనుకూలమైన సమయం. ఆ సమయాల్లోనూ కరెంట్‌ సరఫరా నిలిపివేస్తుస్తున్నారు. ఇక గ్రామాల్లో రాత్రి వేళ కరెంటుపోతే కొవ్వొత్తులను, బుడ్డీలను వెలిగించుకొని అరకొర వెలుతురులోనే విద్యార్థులు చదువుకుంటున్నారు. 


పరీక్షా కాలం...

- ఈ నెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 843 పాఠశాలల నుంచి 38,248 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 

- మే 9వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 217 ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ సంవత్సరం 24156 మంది విద్యార్థులు, ద్వితీయ సంవ త్సరం 24444 మంది విద్యార్థులు  ఉన్నారు. 89 కేంద్రాల్లో 48600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 

- ఉమ్మడి జిల్లాలో 72 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 15 వేల మందికి పైగా విద్యార్థులు మే 2వ తేదీ నుంచి జరిగే ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. 


ఇష్టారాజ్యంగా విద్యుత్‌ కోతలు 

పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్‌ కోతలు 6 గంటలే ఉండాలి.. అవి కూడా విడతల వారీగా పగటిపూట అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రాత్రి పూట కరెంట్‌ కోత విధిస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో సాయంత్రం నుంచే సరఫరా నిలిపివేస్తున్నారు. రెండు, మూడు గంటల పాటు సరపరా నిలిచిపోతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతలపై విద్యుత్‌శాఖాధికారులు సరైన సమాదానం చెప్పలేక  తమ సెల్‌ఫోన్లు బంద్‌ చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


భయంగా ఉంది 

- పి.యశ్వంత్‌కుమార్‌, పదో తరగతి విద్యార్థి, జెడ్పీ హైస్కూల్‌, పెద్ద చెప్పలి, కమలాపురం మండలం 

పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే భవిష్యత్తు బాగుటుందని ఏడాదంతా పరీక్షల కోసం చాలా కష్టపడ్డాం. పరీక్షలు దగ్గరపడే సమయంలో కరెంట్‌ కోతలు విధిస్తుండ టంతో మా కష్టం వృథా అవుతుందేమోనని భయంగా ఉంది. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసి మా భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలి. 


సమయం వృథా

- గంధం బాబు, పదో తరగతి విద్యార్థి, శ్రీ వెంకటేశ్వర ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల, బయనపల్లె, సికేదిన్నె మండలం

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పాయింట్ల(జీపీఏ) పద్ధతిలో కాకుండా మార్కుల విధానంలో నిర్వహిస్తున్నారు. ఎక్కువ మార్కులు సాధించాలంటే బాగా చదువుకోవాలి. కరెంటు కోతలతో సమయం వృథా అవుతోంది. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలి. 


చర్యలు తీసుకుంటున్నాం 

- శోభావాలంటీన, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, ఎస్పీడీసీఎల్‌, కడప 

జిల్లాలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రెండు వారాల క్రితం విద్యుత్‌ సమస్య ఉండేది. ప్రస్తుతం గృహాలకు పవర్‌ కట్‌ లేదు. ప్రభుత్వం పవర్‌ హాలిడే ప్రకటించడం ద్వారా గృహాలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ ఇస్తున్నాం. దీనిపై అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. 

Updated Date - 2022-04-22T07:41:51+05:30 IST