పంతగాని నిరసన దీక్ష భగ్నం

ABN , First Publish Date - 2022-03-05T05:36:05+05:30 IST

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం చిట్వేలి మండలం నాగవరంలోని తన స్వగ్రామంలో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉదయాన్నే నాగవరంలోని ఆయన ఇంటికి పోలీసులు చేరుకుని దీక్షకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పంతగాని దీక్షకు కూర్చున్నారు.

పంతగాని నిరసన దీక్ష భగ్నం
నాగవరంలోని తన స్వగృహంలో పంతగాని నరసింహప్రసాద్‌ చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేస్తున్న పోలీసులు

చిట్వేలి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

పోలీ్‌సస్టేషన్‌ వద్ద టీడీపీ కార్యకర్తల నినాదాలు

ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు

రైల్వేకోడూరు / చిట్వేలి మార్చి 4: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం చిట్వేలి మండలం నాగవరంలోని తన స్వగ్రామంలో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉదయాన్నే నాగవరంలోని ఆయన ఇంటికి పోలీసులు చేరుకుని దీక్షకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పంతగాని దీక్షకు కూర్చున్నారు. కొంత సేపటికి శిబిరంలో ఉన్న ఆయనను పోలీసులు బలవంతంగా చిట్వేలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో పంతగాని అనుచరులు, టీడీడీ నాయకులు, కార్యకర్తలు చిట్వేలి-కోడూరు ప్రధానదారిలో బైఠాయించారు. కాసేపటికి అందరూ చిట్వేలి పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో చిట్వేలిలో ఉద్రిక్తతత చోటుచేసుకుంది. పోలీ్‌సస్టేషన్‌లోనే నరసింహప్రసాద్‌ దీక్ష చేస్తామని చెప్పడంతో రైల్వేకోడూరు సీఐ కె.విశ్వనాథరెడ్డి, చిట్వేలి ఎస్‌ఐ పసుపుల వెంకటేశ్వర్లు అంగీకరించ లేదు. దీక్షకు అనుమతి లేదని, 30 యాక్టు అమల్లో ఉందని, కేసుల దాకా దారితీసుకోవద్దని హెచ్చరించారు. వైద్యపరీక్షలు నిర్వహించి నరసింహప్రసాద్‌కు బీపీ ఎక్కువగా ఉందని చెప్పడంతో ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన అంగీకరించలేదు. దీంతో పోలీసులు నరసింహప్రసాద్‌కు నోటీసులు జారీ చేసి సంతకాలు చేయించుకుని, రైల్వేకోడూరు వరకు పోలీస్‌ బందోబస్తుతో తీసుకు వచ్చి తిరుపతికి పంపించారు. అంతకు ముందు ఆయన పోలీస్‌స్టేషన్‌ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తమ సొంత ఇంట్లో కూడా నిరసన వ్యక్తం చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి రాజంపేట జిల్లా సాధన కోసం ఒక గంట పాటైనా ఆందోళన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతికూల వాతావరణం కల్గిన రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రాజంపేటలో అన్ని వనరులు ఉన్నాయని దీనిని జిల్లా కేంద్రం చేయాలని కోరారు. అలా వీలుకాకుంటే రైల్వేకోడూరును శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుయువత నాయకుడు బొక్కసం సునీల్‌రాయల్‌, స్థానిక నాయకులు పోతురాజు నవీన్‌, కస్తూరి దినేష్‌, సుబ్బరాయుడు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:36:05+05:30 IST