‘అన్నమయ్య’కే తలమానికం మంగంపేట ముగ్గురాళ్ల గనులు
ABN , First Publish Date - 2022-04-07T05:00:35+05:30 IST
ప్రపంచంలోనే నాణ్యతకు మారుపేరైన మంగంపేట బెరైటీస్ నిక్షేపాలు నేడు అన్నమయ్య జిల్లాకు తలమానికంగా నిలవనున్నాయి.
ఏడాదికి వెయ్యి కోట్ల పైబడి వ్యాపారం
200 పైబడి కర్మాగారాల ద్వారా 2 వేల మందికి ఉపాధి
రాజంపేట, ఏప్రిల్ 6 : ప్రపంచంలోనే నాణ్యతకు మారుపేరైన మంగంపేట బెరైటీస్ నిక్షేపాలు నేడు అన్నమయ్య జిల్లాకు తలమానికంగా నిలవనున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం కడప-రేణిగుంట హైవే రోడ్డు ఆనుకుని సుమారు వెయ్యి ఎకరాల పైబడి విస్తీర్ణంలో కొలువుదీరి ఉన్న మంగంపేట బెరైటీస్ నిక్షేపాలు ఈ జిల్లాకు ఓ పెద్ద ఆర్థిక వనరు. సుమారు 50 సంవత్సరాలుగా మంగంపేట ప్రాంతంలో బెరైటీస్ నిక్షేపాలను వెలికితీస్తున్నారు. ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. అనేక ఔషధాలకు, ఇతర అనేక అవసరాలకు ఉపకరించే ఈ బెరైటీస్ ఖనిజాలను ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. బంగారం కంటే ఎంతో విలువైన పుల్లరిన్ నిక్షేపాలు కూడా ఈ బెరైటీస్ ఖనిజానికి సంబంధించిన వృథా మట్టిలో నిక్షిప్తమై ఉన్నట్లు నిపుణులు ఇదివరకే వెల్లడించారు. ఈ బెరైటీస్ ఖనిజాలను ప్రపంచంలోని నలబై దేశాలకు నిత్యం చెన్నై హార్బర్ ద్వారా ఎగుమతి చేస్తున్నారు. పెట్రోలు శుద్ధికి, మందుల తయారీకి ప్రపంచ దేశాలు ఈ బెరైటీస్‌ను వినియోగిస్తున్నాయి. ఈ బెరైటీస్ ఖనిజం ద్వారా సుమారు 200 చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని 2 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మంది లబ్ధి పొందుతున్నారు. అందువల్ల రాష్ట్రానికి ఎంతో ఆర్థిక వనరుగా ఉండే ఈ బెరైటీస్ గనులు నేడు అన్నమయ్య జిల్లాకు తలమానికంగా నిలువనున్నాయి. ఇది జిల్లాకు ఎంతో ఆదాయ వనరుగా మారనుంది.
అనేకమంది రాజకీయ ఎదుగుదలకు ఆర్థిక వనరుగా...
మంగంపేట బెరైటీస్ గనులు అనేకమంది రాజకీయ నేతల ఉన్నతికి ఎంతో ఉపకరించాయి. గతంలో మంగంపేట బెరైటీస్ గనులను ప్రైవేటు వ్యాపారస్తులు తీసుకుని వ్యాపారం చేసుకునే వారు. పదుల కొద్ది నేతలు ఈ మంగంపేట ముగ్గురాయి వ్యాపారం ద్వారానే ఆర్థికంగా పరిపుష్టి కలిగి రాజకీయంగా రాష్ట్ర నేతలుగా గుర్తింపు పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నత స్థానానికి చేరి సీఎం స్థాయికి ఎదిగారంటే ఆయన ఆర్థిక ఎదుగుదలకు మంగంపేట బెరైటీస్‌యే కారణం. ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి ఈ బెరైటీస్ వ్యాపారం ద్వారానే కుమారుడి రాజకీయ ఎదుగుదలకు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగారు. అదే విధంగా మాజీ ఎంపీ కందుల ఓబుల్‌రెడ్డి, ఆయన తనయులు కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సి.ఎం.బలరామిరెడ్డి, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య లాంటి అనేక మంది నేతలు ఈ మంగంపేట బెరైటీస్ వ్యాపారం ద్వారానే ఆర్థికంగా అభివృద్ధి చెంది రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ వెలుగు వెలిగారు. దీనంతటికీ కారణం మంగంపేట బెరైటీస్ గనులే... ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మంగంపేట బెరైటీస్ గనులు అన్నమయ్య జిల్లాలో ఉండటం ఈ ప్రాంతీయులు చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు.
