-
-
Home » Andhra Pradesh » Kadapa » Annamayya district ranks 21st in ration distribution-MRGS-AndhraPradesh
-
రేషన్ పంపిణీలో..అన్నమయ్య జిల్లాకు 21వ స్థానం
ABN , First Publish Date - 2022-04-25T04:53:48+05:30 IST
రేషన్ పంపిణీలో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా 21వ స్థానంలో నిలిచింది.

మదనపల్లె, ఏప్రిల్ 24: రేషన్ పంపిణీలో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా 21వ స్థానంలో నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రథమంగా మొబైల్ డిస్టిబ్యూషన్ ఆపరేటర్ (ఎండీయూ)ల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, విశాఖపట్నం ద్వితీయ, తూర్పుగోదావరి తృతీయస్థానం కైవసం చేసుకున్నాయి. 21వ స్థానంలోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లె, రాయచోటి, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 30 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,123 రేషన్ దుకాణాలు, 4,93,190 రేషన్‌కార్డులు, 310 మొబైల్ వాహనాలు ఉన్నాయి. ప్రతినెలా సరుకుల పంపిణీ ఒకటో తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా, కొత్త జిల్లాల చేరికతో ఎనిమిదో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించారు. డివిజన్లు, మండలాలు, దుకాణాలు, కార్డుల మార్పుతో వారం రోజులు ఆలస్యమైంది. 8వ తేదీ నుంచి ప్రారంభమైన పంపిణీ ఈనెల 23వ తేదీతో ముగియగా ఆదివారం కూడా పొడిగించారు. దీంతో జిల్లాలోని 4,93,190 కార్డుల్లో 4,27,794 కార్డులకు పంపిణీ చేసి 86.74 శాతంలో అన్నమయ్య జిల్లా నిలిచింది. వారం రోజులు ఆలస్యంగా పంపిణీ ప్రారంభం కావడం, ఎండీయూలు సమయ పాలన పాటించకపోవడం, ప్రతినెలా 17వ తేదీతో ముగిసిందని కార్డుదారులు భావించడం, తదితర కారణాలతో పంపిణీ శాతం తగ్గడానికి కారణాలు చెప్పవచ్చు. మరోవైపు కొన్ని చోట్ల ఎండీయూలు నిలిచిపోవడం, 6ఏ కేసులతో కొన్ని దుకాణాలు మూతపడటం, వారి స్థానంలో అథంటికేషన్ ఉన్న వీఆర్‌ఏలు సకాలంలో రాకపోవడం, రేషన్‌డీలర్లకు అందుబాటులో లేకపోవడం కూడా పంపిణీ తగ్గడానికి కారణమనే చెప్పాలి. జిల్లాలోని 30 మండలాల్లో 101 చౌకదుకాణాలతో మదనపల్లె అర్బన్, మదనపల్లె మండలం ప్రథమ స్థానంలో నిలవగా, కె.వి.పల్లె మండలంలో 52 దుకాణాలు, రాయచోటిలో 50 షాపులు, రాజంపేటలో 48 చౌకదుకాణాలు ఉన్నాయి.