పెన్నానది తీరంలో గుర్తు తెలియని సాధువు మృతి

ABN , First Publish Date - 2022-03-06T04:31:14+05:30 IST

జమ్మలమడుగు పట్టణంలో పెన్నానది సమీపాన శనివారం ఓ గుర్తు తెలియని సాధువు మృతి చెందాడు.

పెన్నానది తీరంలో గుర్తు తెలియని సాధువు మృతి
సాధువు మృతదేహం

అంత్యక్రియలు చేసిన మే ఐ హెల్ప్‌యూ ఫౌండేషన్‌

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 5: జమ్మలమడుగు పట్టణంలో పెన్నానది సమీపాన శనివారం ఓ గుర్తు తెలియని సాధువు మృతి చెందాడు. స్థానికులు వెంటనే జమ్మలమడుగు అర్బన్‌ పోలీసుస్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన సాధువును జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కోసం ఎవరూ రాలేదు. మైలవరం మండలం అగస్త్యేశ్వరకోనవైపు నుంచి సాధువు జమ్మలమడుగుకు వచ్చినట్లుగా తెలుస్తోందని హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. మే ఐ హెల్ప్‌యూ ఫౌండేషన్‌ చైర్మన్‌ మోరే లక్ష్మణరావు, మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రసాద్‌, రవి, తిరుపాల్‌, ప్రతాప్‌, నటరాజ, అహమ్మద్‌గౌస్‌, తదితరులు అంత్యక్రియలు నిర్వహించారు. 


రామాపురంలో మతిస్థిమితం లేని వృద్ధుడు..


రామాపురం, మార్చి 5: స్థానిక బస్టాండులో శనివారం మతిస్థిమితం లేని ఎర్రరాజు (65) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ జయరాములు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడి ఎత్తు 5.3, గడ్డంతో కాషాయం దుస్తులు ధరించి ఉన్నాడన్నారు. ఇతడి వద్ద ఉన్న నోట్‌పుస్తకం పరిశీలించగా ఈయన బంధువులు కొండాపురం, తాడిపత్రి పట్టణాల్లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈయన పేరు ఎర్రరాజు అయి ఉండొచ్చు అన్నారు. ఈ వ్యక్తి మతిస్థిమితం లేకుండా కొద్ది రోజుల నుంచి రామాపురం మండల పరిసరాల్లో తిరుగుతూ శనివారం మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ఆస్పత్రిలోని మార్చురీ గదిలో ఉంచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే రామాపురం ఎస్‌ఐ జయరాములుకు తెలియజేయాలన్నారు. వివరాలు తెలిసిన వారు 9121100588కు ఫోన్‌ నెంబరుకు సమాచారాన్ని అందించాలన్నారు. 


భవనానికి పెయింట్‌ వేస్తూ కిందపడి...

దువ్వూరు, మార్చి 5: దువ్వూరులో శనివారం నూతన భవనానికి రంగులు కొడుతూ ఫ్రాన్సిస్‌ (28) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. చాగలమర్రికి చెందిన ఫ్రాన్సిస్‌ దువ్వూరులో ఓ నూతన భవనానికి రంగులు వేసేందుకు రెండు అంతస్థుల భవనంపై సార్వపై నిలబడి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర రక్తగాయం కావడంతో స్థానికులు ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫ్రాన్సిస్‌ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. 

Read more