చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-08-26T04:53:42+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
బేబి రెడ్డిని సన్మానిస్తున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, తదితరులు

బేబీ రెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

కామెన్‌వెల్త్‌లో కాంస్య పతక విజేతకు ఘనసన్మానం


రాయచోటి టౌన్‌, ఆగస్టు 25: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. ఇటీవల లండన్‌లో జరిగిన కామెన్వెల్త్‌ క్రీడల్లో ఫెన్సింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన బేబి రెడ్డికి గురువారం స్థానిక సాయి శుభ కల్యాణ మండపంలో మనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె ఎం.బేబిరెడ్డి కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఫెన్సింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించడం ప్రతిఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బేబిరెడ్డి అన్నమయ్య జిల్లాకు, రాయచోటి ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిందని, ప్రతి ఒక్కరూ ఈమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బేబి రెడ్డి తల్లిదండ్రులు ఆమె ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమన్నారు. తాను కూడా చదువుకునేందుకు ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, అయితే ఒక చేయి లేదనే కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి చదువుకునేందుకు అప్పట్లో తన తల్లి ఒప్పుకోలేదని తెలిపారు. బయటికి వెళ్లి ఉండాలంటే తన బిడ్డ ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని అమ్మ బాధపడేదని కలెక్టర్‌ గుర్తు చేసుకున్నారు. కాంస్య పతక విజేత బేబి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. తాను 4వ తరగతి వరకు చెన్నముక్కపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, అక్కడ నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలెక్షన్‌లో ఎంపికై హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నానన్నారు. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నానని, కామెన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో బంగారు పతకం సాధించి దేశానికి, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానన్నారు. కార్యక్రమంలో డీఈవో రాఘవరెడ్డి, మనం అధ్యక్షుడు ప్రకాష్‌, ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి, పలు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

Read more