మహోన్నత వ్యక్తి అల్లూరి

ABN , First Publish Date - 2022-07-05T05:25:24+05:30 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మహోన్నత వ్యక్తి అని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు.

మహోన్నత వ్యక్తి అల్లూరి
అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద జ్యోతి వెలిగిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి (కలెక్టరేట్‌), జూలై 4: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మహోన్నత వ్యక్తి అని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పీఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు చిన్నప్పటి నుంచి దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేదన్నారు. భారత స్వాతంత్య్రం కోసం గెరిల్లా యుద్ధరీతిలో పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచారన్నారు. యుక్త వయస్సులోనే బ్రిటీష్‌ దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన మన్యం పితూరీ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు చిరుప్రాయంలోనే తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి తరతరాలు గుర్తుంచుకునే విధంగా నిలిచాడన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి అబ్బాలోము, ల్యాండ్‌, సర్వే ఏడీ జయరాజు, హౌసింగ్‌ పీడీ శివయ్య, డ్వామా పీడీ శివప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:25:24+05:30 IST