పరిశ్రమలతోనే జిల్లా సర ్వతోముఖాభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-06T23:32:40+05:30 IST

పరిశ్రమల స్థాపనతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అదికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ తమ ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

పరిశ్రమలతోనే జిల్లా సర ్వతోముఖాభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి (కలెక్టరేట్‌), డిసెంబరు 6: పరిశ్రమల స్థాపనతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అదికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ తమ ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతన పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతులకు సంబంధించి ఇప్పటివరకు 1408 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 1355 దరఖాస్తులు క్లియర్‌ చేశామన్నారు. గడువులోపల పరిశీలించాల్సిన అర్జీలు 6 ఉన్నాయని, ఇవి కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ 2015-20, ఐడీపీ 2020-23 స్కీముల కింద జనరల్‌ అభ్యర్థులకు 3 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కింద రూ.41,16,693, విద్యుత్‌ రాయితీ కింద 3 పరిశ్రమలకు రూ.5,04,702, వడ్డీ రాయితీ కింద ఒక పరిశ్రమకు రూ.2,31,124 మంజూరు చేసినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద 7 యూనిట్లకు (వాహనాలు) పెట్టుబడి రాయితీకి సంబంధించి రూ.1,39,83,331 మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 59 యూనిట్‌లకు గానూ రూ.4,12,13,000 బ్యాంకులు రుణం మంజూరు చేశామని, ఇంకా వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న 393 దరఖాస్తులను బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయాల్సిందిగా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నాగరాజ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసమూర్తి, డీపీవో ధనలక్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి రవిచంద్ర, జిల్లా రవాణా శాఖాధికారి సీతారాంరెడ్డి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ జగదీష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిలో 9న మెగా జాబ్‌ మేళా

స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సహకారంతో ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గిరీషా తెలిపారు. జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాబ్‌మేళాలో 25 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని, వాటి ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శివశంకర్‌, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణలు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్‌ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ చదివిన వారు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని, ఈ జాబ్‌మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్థల పత్రాలు జిరాక్స్‌, ఆధార్‌కార్డు, రెండు ఫొటోలతో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9381069980, 7799587687, 9177143181లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2022-12-06T23:32:43+05:30 IST