సైబర్‌ కేటుగాళ్ల వలపు వల

ABN , First Publish Date - 2022-09-21T05:36:50+05:30 IST

కడపలో సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. కొంత మందికి గుర్తుతెలియని యువతులతో ఫోన్లు చేయించి ఆకర్షిస్తున్నారు. ఆపై ఆ యువతులు వీడియో కాల్‌లో న్యూడ్‌గా తయారై అమాయకులకు వల వేస్తున్నారు. ఎవరైనా అమాయకులు దొరికితే వారిని

సైబర్‌ కేటుగాళ్ల వలపు వల

తియ్యటి మాటలతో పలకరిస్తారు..

న్యూడ్‌ వీడియోలతో రెచ్చగొడతారు

వీరి మాయలో పడితే.. ఖేల్‌ ఖతం

మీ ఖాతాల్లోని డబ్బులన్నీ గుంజేస్తారు

సోషల్‌ మీడియాతో తస్మాత్‌ జాగ్రత్త


సైబర్‌ కేటుగాళ్లు పొంచి ఉన్నారు... మగవాడి వీక్‌ పాయింటే వారికి ఆసరా... ఒక్కసారి వారి మాయలో పడితే... అందమైన అమ్మాయిలు హొయలొలికే అందాలతో.. తియ్యటి మాటలతో ముగ్గులోకి దింపుతారు.. ఒక్కో వలువా వదిలేస్తూ వలపు వల విసురుతారు.. మిమ్మల్ని వారిలా ఒక్కోటి విప్పేయమంటూ రెచ్చగొట్టేలా మాటలు చెబుతారు.. రెచ్చిపోయారో.. ఇక అంతే.. ఆ వీడియోకాల్‌ మొత్తాన్ని రికార్డ్‌ చేస్తారు. మీ జీవితాలతో ఆటలాడుకుంటారు.. మీ మాన, ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగి అందినకాడికి డబ్బులు దోచేస్తారు... అందుకే సెల్‌ఫోన్‌ చేతిలో ఉంది కదా... అని ఇష్టానుసారం యాప్‌లు డౌన్‌లోడు చేయడం.. చాటింగ్‌లకు పాల్పడటం చేస్తే... మీ పని అయిపోయినట్లే.. బీకేర్‌ ఫుల్‌.


కడప (క్రైం), సెప్టెంబరు 20: కడపలో సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. కొంత మందికి గుర్తుతెలియని యువతులతో ఫోన్లు చేయించి ఆకర్షిస్తున్నారు. ఆపై ఆ యువతులు వీడియో కాల్‌లో న్యూడ్‌గా తయారై అమాయకులకు వల వేస్తున్నారు. ఎవరైనా అమాయకులు దొరికితే వారిని కూడా అలాగే తయారు చేస్తారు. కట్‌ చేస్తే.. వారి సెల్‌లకు వారి న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. వీరి వలలో చిక్కుకొని పలువురు విలవిలాడి పోతున్నారు. ఇలాంటి బాధితులు కడపలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 


ఇలా వల వేస్తారు...

ఫేస్‌బుక్‌, వాట్స్‌పలతో పాటు ఆన్‌లైన్‌లో కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి సైబర్‌ నేరగాళ్లు వల వేస్తారు. మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పంపుతారు. ఫోన్‌లో హాయ్‌.. అంటూ అమ్మాయిలు పలకరిస్తూ.. మీతో కాసేపు మాట్లాడవచ్చా.. అంటూ మాటలు కలుపుతారు. ఆపై ఫేస్‌బుక్‌లలో చాటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. కాసేపటికే వ్యక్తిగత విషయాలను రాబట్టి వారి మొబైల్‌ను హ్యాక్‌ చేస్తారు. తరువాత వారి ఫేస్‌బుక్‌కు కానీ, వాట్స్‌పలకు కానీ అశ్లీలంగా ఉండే ఫొటోలను పంపుతారు. ఇక అక్కడి నుంచి బెదిరింపులకు దిగుతారు. 

మరికొందరు యువతులు చాటింగ్‌లు, వీడియోకాల్స్‌ చేస్తారు. వారి అందాలతో ఆకట్టుకుంటారు. తరువాత న్యూడ్‌గా తయారై వీరిని కూడా అలా చేయాలంటూ ప్రేరేపిస్తారు. కట్‌ చేస్తే.. తరువాత న్యూడ్‌గా ఉండే ఫొటోలను పంపించి ఇక బ్లాక్‌మెయిల్‌ మొదలెడతారు. వీడియోలు బయటికి వస్తే ఎక్కడ తమ పరువు పోతుందోనని భయంతో వారు అడిగిన మొత్తం చెల్లించుకోవాల్సిందే. లేదంటే అప్పటికే వీరి మొబైల్‌లో ఉండే ఫోన్‌ నెంబర్లను హ్యాక్‌ చేసి వేధింపులు మొదలెడతారు. ఎక్కువగా రాజస్తాన్‌, యూపీ, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన వారు ఇలాంటి వాటికి పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎవరైనా కొత్త వ్యక్తులు ఇలాంటి న్యూడ్‌ కాల్స్‌ చేస్తే అప్రమత్తమై సంబంధిత పోలీసుస్టేషన్‌లో ఆ నెంబరుపై ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నెంబరుకు  కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తే మంచిది. సోషల్‌ మీడియాకు ప్రొటెక్షన్‌ తప్పనిసరి అని.. ఎక్కువగా ఫేస్‌బుక్‌లో మన ఫొటోలు, వీడియోలు ఇతర సమాచారం లీక్‌ అవుతుంటుందని, ఇలాంటివి సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటారని పోలీసులు అంటున్నారు. 


జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు

- కడపకు చెందిన ఒక ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి ఇటీవల ఓ యువతి వీడియో కాల్‌ చేసింది. అయితే ఆ ఉద్యోగి తాను వయసు పైబడిందని చెప్పినప్పటికీ.. ఆ యువతి న్యూడ్‌ వీడియో కాల్‌తో వల వేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ ఉద్యోగి అప్రమత్తమై ఆ నెంబరును బ్లాక్‌ చేసి పోలీసులను ఆశ్రయించాడు.

- జిల్లాకు చెందిన ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ న్యూడ్‌ వీడియో వలలో చిక్కుకున్నాడు. దీంతో ఆ ఉద్యోగిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వచ్చారు. సమాజంలో తన పరువు పోతుందని భయపడిన ఆ ఉద్యోగి వారికి లక్షలాది రూపాయలు చెల్లించినా ఆ పై కూడా బెదిరింపులు వస్తుండడంతో ఎట్టకేలకు సైబర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

- ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన మరో ఉద్యోగితో ఇటీవల ఓ నెంబరు నుంచి ఓ యువతి ఫోన్‌ చేసి మాట్లాడింది. తర్వాత న్యూడ్‌ వీడియో కాల్‌ చేసి మాట్లాడింది. అతడిని కూడా తనలా న్యూడ్‌గా తయారు కమ్మంది.. అతని న్యూడ్‌ వీడియో కాల్‌ రికార్డ్‌  చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి రూ.1.25 లక్షలు వసూలు చేసింది. ఇక ప్రొద్దుటూరుకు చెందిన ఓ ప్రైవేటు టీచరును సైతం ఇలాంటి బెదిరింపులు చేయగా.. రూ.10వేలు పంపించినప్పటికీ, మళ్లీ బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించాడు.

- కడప ఎన్జీవో కాలనీకి చెందిన ఓ విద్యార్థి, పులివెందుల ప్రాంతానికి చెందిన మరో ప్రైవేటు ఉద్యోగికి న్యూడ్‌ వీడియో కాల్స్‌ వచ్చాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినా ఎంతో మంది ఉద్యోగులు, విద్యార్థులు వీరి బారిన పడి బాధితులుగా మిగిలారు.  


అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవద్దు

- సైబర్‌ సెల్‌ సీఐ శ్రీధర్‌నాయుడు

కొంత మంది సోషల్‌ మీడియా గ్రూపుల్లో అందమైన యువతుల ఫొటోలను పెట్టి ప్రొఫైల్‌ నడుపుతున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌, వీడియో కాల్స్‌ రిసీవ్‌ చేయకుండా ఉండడమే మంచిది. కొంత మందికి వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేసి గుర్తు తెలియని అమ్మాయిల న్యూడ్‌ కాల్స్‌తో ఫోన్‌లు చేయించి ఆపై బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో అమాయకులు భయపడి వారు అడిగిన డబ్బు ఇస్తున్నప్పటికీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూనే ఉంటారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పెట్టడం కానీ, వారితో చాటింగ్‌లు, వీడియో కాల్స్‌ చేయడం మంచిది కాదు. సోషల్‌ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఇలాంటి ఉచ్చులో పడితే తక్షణమే 1930కు కానీ, లేదా సంబంధిత పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఆ నెంబర్లను బ్లాక్‌ చేయడం మంచిది.

Updated Date - 2022-09-21T05:36:50+05:30 IST