నేతల్లో సర్వే గుబులు

ABN , First Publish Date - 2022-09-09T04:31:20+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధిష్టానం 2024 ఎన్నికల కోసం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో అనేక వడపోతలు చేస్తోంది.

నేతల్లో సర్వే గుబులు

ఆశావహుల వడపోతలో టీడీపీ అధిష్ఠానం


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

తెలుగుదేశం పార్టీ అధిష్టానం 2024 ఎన్నికల కోసం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో అనేక వడపోతలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల కోసం అధిష్ఠానం జల్లెడ పడుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపఽధ్యంలో కొన్ని బృందాలతో టీడీపీ అధిష్ఠానం గుట్టుచప్పుడు కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో అన్నమయ్య జిల్లాలో అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న నేతల్లో.. అధిష్ఠానం చేయిస్తున్న సర్వే గుబులు రేపుతోంది. రాజంపేట పార్లమెంటు స్థానానికి తమ అభ్యర్థిగా వ్యాపారవేత్త గంటా నరహరిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థుల  విషయంలోనే గెలుపు గుర్రాల కోసం టికెట్టు ఆశిస్తున్న ఆశావహులను పరిశీలిస్తోంది. జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే పీలేరుకు, రాజంపేటకు అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. అదేవిధంగా గ్రూపులు కూడా ఉండడంతో అభ్యర్థులు ఎవరనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. 

తంబళ్లపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ ప్రధానంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో లేరు. త్వరలోనే ఆయన పార్టీలో చేరతారనే ప్రచారం ఉంది. ఇక్కడ శంకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా ఒక గ్రూపు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జూలైలో కలికిరిలో  చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశం సందర్భంగా రెండు గ్రూపులు ఘర్షణ పడ్డ విషయం కూడా తెలిసిందే. తర్వాత అధిష్ఠానం రెండు గ్రూపులను విజయవాడకు పిలిపించి తలంటినట్లు తెలిసింది. అయినా ఇక్కడ రెండు గ్రూపులు కలవలేదని కార్యకర్తలు వాపోతున్నారు. 

మదనపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ ప్రధానంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. వ్యాపారవేత్త జయరామ్‌నాయుడు సైతం టికట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. వీళ్లే కాకుండా మరికొందరు లోలోపల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. 

రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమే్‌షకుమార్‌రెడ్డి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ప్రసాద్‌బాబు, మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డిలు టికెట్‌ను ఆశిస్తున్నారు. రైల్వేకోడూరులో ప్రధానంగా పంతగాని నరసింహ ప్రసాద్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు ఒక మహిళా అభ్యర్థి పేరును అధిష్ఠానం ముందు ఉంచినట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా పలువురు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ పర్యాయం సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగానే సీటు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహుల్లో గుబులు నెలకొంది. 


ఆర్థిక, అంగబలమే ప్రధానం

టీడీపీ శ్రేణుల కథనం మేరకు.. అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్ఠానం చేపడుతున్న సర్వే ప్రధానంగా అభ్యర్థి ఆర్థిక, అంగబలం చుట్టూ జరుగుతున్నట్లు తెలిసింది. గతంలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని పలుమార్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. మిథున్‌రెడ్డి భారీ మెజార్టీతో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈసారి రాజంపేట పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుల సమీకరణలను సైతం పరిగణలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఏ మేరకు డబ్బు ఖర్చు చేయగలుగుతారు..? అతనికి టికెట్‌ ఇస్తే.. ఏ మేరకు ప్రభావం చూపుతాడు? ఆ అభ్యర్థి కులం ప్రభావం ఏ మేరకు ఉంటుంది.? అనేది పరిగణలోకి తీసుకుంటారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటి వరకు కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా కొందరి పేర్లు తెరముందుకు వచ్చే అవకాశం ఉంది. 


గ్రూపులతోనే అసలు సమస్య

ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గడపగడపకు వైసీపీ కార్యక్రమం సందర్భంగా పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జూలైలో మదనపల్లెలో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైంది. ఒకవిధంగా చెప్పాలంటే మినీ మహానాడు తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అయితే చాలా నియోజకవర్గాలలో టీడీపీలో రెండు, మూడు గ్రూపులుండడంతో కార్యకర్తలు ఆయోమయంలో ఉన్నారు. ఈ గ్రూపులు పార్టీ శ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నాయని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. వీటన్నింటినీ అధిష్ఠానం దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - 2022-09-09T04:31:20+05:30 IST