కారును ఢీకొన్న లారీ
ABN , First Publish Date - 2022-08-18T06:34:26+05:30 IST
చింతకొమ్మదిన్నె మండల పరిధిలో మెప్మా పీడీ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఆయన సతీమణి మృతిచెందారు. పీడీతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు కావడంతో హైడ్రాలిక్ కటర్ సాయంతో కారును కట్ చేసి క్షతగాత్రులను వెలికి తీశారు. సీకే దిన్నె ఎస్ఐ అరుణ్‌రెడ్డి

నుజ్జునుజ్జు అయిన కారు
మెప్మా పీడీ సతీమణి మృతి
పీడీతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
సీకేదిన్నె, ఆగస్టు 17: చింతకొమ్మదిన్నె మండల పరిధిలో మెప్మా పీడీ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఆయన సతీమణి మృతిచెందారు. పీడీతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు కావడంతో హైడ్రాలిక్ కటర్ సాయంతో కారును కట్ చేసి క్షతగాత్రులను వెలికి తీశారు. సీకే దిన్నె ఎస్ఐ అరుణ్‌రెడ్డి వివరాల మేరకు..
సీకేదిన్నె మండలం ఆవులవాండ్లపల్లెకు చెందిన రామమమోహన్రెడ్డి మెప్మా పీడీగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కొండావాండ్లపల్లెకు చెందిన ఈయన సతీమణి నళినీదేవి(47) ఉపాధ్యాయురాలు. వీరిద్దరూ శుభకార్యాల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయం సిబ్బందితో కలసి కారులో పులివెందులకు బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం తుత్తుకుడి నుంచి జమ్మలమడుగుకు జిప్సం లోడుతో వెళుతున్న లారీ వీరి కారును ఔటర్ రింగ్‌రోడ్డులోని పబ్బాపురం సమీపంలో ఉదయం 8.30 గంటలకు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజు నుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కారులోనే ఇరుక్కుపోయారు. కారు ధ్వంసం అయిన తీరు చూసి అందులో ఉన్నవారంతా చనిపోయి ఉంటారని అందరూ భావించారు. అగ్నిమాపక, పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమించి కారులో ఉన్న మెప్మా పీడీ రామమోహన్‌రెడ్డి, ఏవో సురేష్‌కుమార్‌రెడ్డి, పీవో సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకటరమణారెడ్డి, పీడీ సతీమణి నళినీదేవిని అతి కష్టం మీద బయటకు తీశారు. అప్పటికే నళినీదేవి మృతిచెందగా తీవ్రంగా గాయపడిన మిగతా నలుగురిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో మెప్మా పీడీని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తీసుకెళ్లారు. ఈ మేరకు సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది
ఈ ప్రమాదంలో లారీకి, బ్రిడ్జీకి మధ్యలో కారు ఇరుక్కుపోయింది. దీంతో కారులోని వారిని రక్షించేందుకు అటు పోలీసు సిబ్బందితోపాటు ఇటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది అధునాతన హైడ్రాలిక్ గ్యాస్ కట్టర్లు ఉపయోగించి కారు బైభాగాన్ని కట్ చేసి కారులోంచి ఒక్కొక్కరిని బయటకు తీశారు. జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్, కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి దగ్గరుండి సిబ్బందికి సూచనలు ఇచ్చి కారులోని వారికి ధైర్యం నింపి బయటకు తీశారు. ఎక్సకవేటర్‌ను తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని, కారును తొలగించడంతో ట్రాఫిక్ యధావిధిగా కొనసాగింది. సంఘటన స్థలం వద్దకు ఆర్అండ్బీ ఈఈ ప్రభాకర్‌నాయుడు, వైద్యాధికారి ఉన్నీసల్మా, ఎస్ఐ అరుణ్‌రెడ్డి తదితరులు చేరుకుని పరిశీలించారు.
బయల్దేరిన కొద్దిసేపటికే మృత్యు ఒడిలోకి...
మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి, భార్య నళినీదేవి, సిబ్బందితో కలిసి కడప నుంచి పులివెందులకు బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరుగడంతో మెప్మా సిబ్బందితోపాటు పీడీ కుటుంబ సభ్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణించేవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అందరూ భావించారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ కట్టర్లు ఉపయోగించి కారులోంచి వారిని వెలికి తీయడంలో ప్రత్యేక చొరవ చూపడంతో మెప్మా పీడీతోపాటు మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే పీడీ సతీమణి మృతిచెందడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేశారు.
ఆ రెండూర్లలో విషాదం
చక్రాయపేట/రామాపురం, ఆగస్టు 17: కడప శివారులోని రింగ్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెప్మా పీడీ రామమోహన్రెడ్డిది చక్రాయపేట మండలం ఆవులవాండ్లపల్లె. మృతిచెందిన ఈయన సతీమణి నళినీదేవిది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె. ఈమె లక్కిరెడ్డిపల్లె వెలుగు గురుకుల పాఠశాలలో సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నళినిదేవి మృతిచెందడం, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డంతో వీరిద్దరి సొంతూర్లలో విషాదం నెలకొంది. భర్తతో కలిసి శుభకార్యాలకు వెళుతూ దుర్మరణం చెందడంతో వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.