Rain: తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

ABN , First Publish Date - 2022-12-09T21:01:27+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో తిరుమల (Tirumala)లో శుక్రవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది.

Rain: తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

తిరుమల: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో తిరుమల (Tirumala)లో శుక్రవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నల్లటి మేఘాలు తిరుమలను కప్పేయగా, శుక్రవారం వేకువజాము నుంచే చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది.ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో తిరుమలకు వచ్చిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది దర్శనమైన వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. ఉన్నవాళ్లు కూడా గదులకే పరిమితమయ్యారు. శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించే భక్తులతో పాటు సందర్శనీయ ప్రదేశాలైన పాపవినాశనం, శ్రీవారిపాదాలకు వెళ్లే భక్తుల సంఖ్య భాగా తగ్గిపోయింది. మరోవైపు కాలినడకన తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా వర్షంలో ఇబ్బందులు పడ్డారు.

శ్రీవారి సేవలో జస్టిస్‌ నాగార్జునరెడ్డి

ఏపీ ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.జస్టిస్‌ నాగార్జున రెడ్డిని వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-12-09T21:01:28+05:30 IST