జడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టీన కులధ్రువీకరణపై విచారణ

ABN , First Publish Date - 2022-12-10T01:33:05+05:30 IST

జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీన ఎస్‌సీ కులధ్రువీకరణ వివాదంపై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి విచారణ చేపట్టారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టీన కులధ్రువీకరణపై విచారణ

గుంటూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీన ఎస్‌సీ కులధ్రువీకరణ వివాదంపై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి విచారణ చేపట్టారు. శుక్రవారం ఇరు వర్గాలను కలెక్టరేట్‌కి పిలిపించిన ఆయన వేర్వేరుగా విచారణ జరిపారు. క్రిస్టీన ఎస్‌సీ కాదని, ఆమె ఎప్పుడో బాప్టిజం తీసుకొన్నారని కొల్లిపరలో జడ్పీ టీసీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన సరళకుమారి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె అందజేసిన ఆధారాలను అప్పటి అధికారు లు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసు విచారణ ముగిస్తూ సరళకుమారి ఇచ్చే ఆధారాలను పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకో వాలని ఆదేశించింది. మూడు నెలల వ్యవధిలో విచారణ పూర్తిచేయాలని ఇటీవలే ఆదేశించగా శుక్రవారం ఇరువర్గాలను కలెక్టర్‌ పిలిపించారు. విచారణ అనంతరం తాము కలెక్టర్‌కు ఏమి చెప్పిందనే వివరాలను మీడియాతో పంచుకొన్నారు.

న్యాయవాది, బీజేపీ నాయకుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ హెనీ క్రిస్టీన ఎస్‌సీ కాదని అన్ని ఆధారాలు కలెక్టర్‌కు ఇచ్చాం. హైకోర్టు ఆదేశాల మేరకు త్వరగా విచారణ పూర్తిచేయాలని కోరామన్నారు. ఆమె బాప్టిజం తీసుకొన్న ఆధారాలు కూడా అందజేశామన్నారు. వివాహ సర్టిఫికే ట్‌ కూడా ఇచ్చామని చెప్పారు. పిటీషనర్‌ సరళకుమారి మాట్లాడుతూ నిజమైన ఎస్‌సీలకు న్యాయం జరగాలన్నారు. క్రిస్టీన ఎస్‌సీ కాదని, ఆమె క్రైస్తవ మతం తీసుకొన్నారని చెప్పారు. ఆమె భర్త హార్వెస్టు ఇండియా అనే క్రైస్తవ సంస్థని కూడా నడుపుతున్నారు. వీళ్లకి ఒక చర్చి కూడా ఉన్నదన్నారు.

జడ్పీ చైౖర్‌పర్సన్‌ హెనీక్రిస్టీన మాట్లాడుతూ తాను 2014లోనే తాడికొండ ఎస్‌సీ రిజర్వుడ్‌ స్థానంనుంచి పోటీచేయడం జరిగిందన్నారు. తన కులానికి సంబంధించి ఆధారాలన్నీ ఇచ్చామ న్నారు. ఎన్నికల సంఘం అనుమతితోనే పోటీ చేశామని గుర్తుచేశారు. కొల్లిపర జడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేసినప్పుడు కూడా ఆధారాలు ఇచ్చామని, బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తోందన్నారు.

Updated Date - 2022-12-10T01:33:21+05:30 IST