92,750 మందికి చేయూత

ABN , First Publish Date - 2022-09-24T05:59:01+05:30 IST

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 92,750 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

92,750 మందికి చేయూత
వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కును పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు

మూడో విడత పంపిణీలో కలెక్టర్‌

గుంటూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 92,750 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. పథకం మూడో విడత ఆర్థికసాయం పంపిణీ శుక్రవారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున రూ.173.91 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. దీంతో మూడేళ్లలో రూ. 497.41 కోట్లను పంపిణీ చేసినట్లు అయిందన్నారు. ప్రభుత్వ సాయం కోరితే కిరాణ, వస్త్ర, పండ్లు, కూరగాయలు, రిటైల్‌ వ్యాపారాల ఏర్పాటుకు హిందూస్థాన్‌ యూని లీవర్‌, ఐటీసీ, పీ అండ్‌ జీ వంటి బహుళ జాతి కంపెనీలతో టై అప్‌ చేసి హోల్‌సేల్‌ రేట్లకే సరుకులను అందిస్తామన్నారు. పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి అమూల్‌ ద్వారా పాలు కొనుగోలు చేయిస్తామని చెప్పారు. అర్హత ఉండి లబ్ధి పొందలేని వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే రెండో విడతలో పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మండల కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. జడ్పీచైర్‌పర్సన్‌ హెనీక్రిష్టినా మాట్లాడుతూ మహిళల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారతలో భాగంగా సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో జేసీ రాజకుమారి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, శ్రీదేవి, వివిధ సంస్థల చైర్మన్లు పురుషోత్తం, కోల భవాని, ముంతాజ్‌ పఠాన్‌, డిప్యూటీ మేయర్‌ సజీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

అచీవ్‌మెంట్‌ అవార్డుల దరఖాస్తులను పంపాలి

2022 సంవత్సరానికి విశిష్ట సేవలందించిన వారికి గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వ వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయబోతోన్నదని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అందిన ప్రతిపాదనలను ఈ నెల 30వ తేదీ లోపు పరిశీలించి సీఎంవో కార్యాలయానికి అందేలా చూడాలని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. శుక్రవారం సీఎంవో నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌తో మాట్లాడారు. గత ఏడాది అవార్డుల కోసం దరఖాస్తు చేసుకుని అవార్డు పొందని వారు కూడా అప్లికేషన్‌ పెట్టుకోవచ్చన్నారు. ప్రతిపాదనలను పంపాల్సిన వారు జిల్లా రెవెన్యూ అధికారి/స్టెప్‌ సీఈవో కార్యాలయానికి పంపాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో కే చంద్రశేఖర్‌రావు, స్టెప్‌ సీఈవో బీ వెంకటనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు పాల్గొన్నారు. 


Read more