ఎరువుల బ్లాక్
ABN , First Publish Date - 2022-08-10T05:59:37+05:30 IST
ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నారుమళ్లు పెంపకానికి ఎరువులు అవసరమయ్యాయి.

ఎక్కువ ధరకు వ్యాపారుల అమ్మకాలు
సొసైటీలకు ఎరువులు ఇవ్వని మార్క్‌ఫెడ్
ఆర్బీకేల్లో రైతులకు అవసరంలేని ఎరువులు
డీఏపీ కావాలంటే కాంప్లెక్స్ కొనాలని ఒత్తిడి
వ్యాపారుల దోపిడీని పట్టించుకోని అధికారులు
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నారుమళ్లు పెంపకానికి ఎరువులు అవసరమయ్యాయి. ప్రధానంగా పత్తి, వరి సాగుకు ఎక్కువగా ఎరువులు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎక్కువ మంది రైతులు డీఏపీని వాడుతున్నారు. రైతుల వాడకానికి తగిన విధంగా ఉత్పత్తి లేదు. ఒకవైపు కొరత మరోవైపు రైతుల నుంచి డిమాండ్ ఉంది. ఇదే అవకాశంగా రైతులకు అవసరమైన ఎరువులను వ్యాపారులు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రధానంగా డీఏపీ కావాలంటే కాంప్లెక్స్ లేదంటే సూక్ష్మఎరువులు కొనాల్సిందేనని పట్టుబడుతున్నారు. డీఏపీ బస్తా రూ.1,350కి అమ్మాల్సి ఉండగా దానిని రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య విక్రయిస్తున్నారు. మార్కెట్లో నెలకొన్న కొరతతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టా ల్సిన అగ్రి, విజిలెన్స్ అధికారులు వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి ఎరువుల దందాను అడ్డుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎరువుల బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టడంలో సొసైటీలు కీలకపాత్ర పోషిస్తాయి. మార్క్‌ఫెడ్ అధికారులు సొసైటీలకు ఎరువులను కేటాయించడంలేదు. ఇది కూడా ఎక్కువ ధరకు కారణమని సమాచారం. రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)కు ఎరువులు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రైతులకు అవసరంలేని ఎరువులు ఆర్బీకేల్లో ఉంటున్నాయి. యూరియా బస్తా రూ.270గా కేంద్రం నిర్ణయించగా రూ.350 చొప్పున అమ్ముతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతులు డీఏపీకి యూరియా కలిపి పంటలకు చల్లుతున్నారు. మార్కెట్లో ఉన్న పాతనిల్వలను కూడా కొత్త ధరలకు అమ్ముతున్నారు. ఫిబ్రవరిలో డీఏపీ బస్తా ధరను రూ.1,200 నుంచి రూ.1,350కి పెంచారు. అంతకముందు ఉన్న నిల్వలను కూడా రూ.1,350కి అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా అధికారులు ఇంతవరకు ఎరువుల గిడ్డంగులు, షాపులను తనిఖీ చేయలేదు. ఎరువుల బస్తాలను తూకం వేసి తక్కువగా ఉంటే కంపెనీలకు జరిమానా వేయాలి. దుకాణాల వద్ద ఎరువుల ధరలను బోర్డులపై ప్రదర్శించాలి. ఎక్కువ ధరలకు అమ్మితే జేసీకి ఫిర్యాదు చేయాలని షాపులు, గిడ్డంగుల వద్ద ఫోన్ నంబరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అయితే ఉమ్మడి జిల్లాలోని ఏ దుకాణం వద్ద కూడా ఈ ప్రక్రియ ఎక్కడా పాటించడంలేదు. అగ్రి అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు కూడా దాడులకు స్వస్తి పలకడంపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా విక్రయాలు..
- ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో డీఏపీ కావాలంటే లింక్ ఎరువులు కొనాల్సిందే. బస్తా రూ.1,350 అమ్మాల్సిన డీఏపీని వ్యాపారులు రకరకాలుగా అమ్ముతున్నారు.
- డీఏపీ కావాలంటే రూ.1,500 నుంచి రూ.1,600 చెల్లించాల్సి వస్తుంది.
- కాంప్లెక్స్ 14-35-14 బస్తా రూ.1,700కు కొంటే ఒక బస్తా డీఏపీ ఇస్తామని వ్యాపారులు చెప్తున్నారు.
- కాంప్లెక్స్ 20-20-0-13 బస్తా రూ.1,500కు కొంటే ఒక బస్తా డీఏపీ ఇస్తారు.
- నానొ యూరియా కొంటేనే డీఏపీ ఇస్తామని వ్యాపారులు చెప్తున్నారు.
- ఆర్గానిక్ సిటి కంపోస్ట్ లేదా కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం, సల్ఫర్ కొంటే డీఏపీ ఇస్తారు.