YCP GOVT: అప్పులిప్పిస్తే బిల్లులు ఇస్తాం!

ABN , First Publish Date - 2022-12-26T03:05:19+05:30 IST

అక్షరాలా లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు (రూ.1,85,000 కోట్లు).. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు ఇవి! రిటైరైన ఉద్యోగుల నుంచి వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీల వరకు..

YCP GOVT: అప్పులిప్పిస్తే  బిల్లులు ఇస్తాం!

‘బిర్లా బామ్మర్ది దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాను! కోటి రూపాయలు అప్పు ఎలా చేయాలో సలహా ఇచ్చినందుకు, ఆయన నాకు లక్ష రూపాయలు అప్పు ఇచ్చారు’...

అప్పుల అప్పారావు’ సినిమాలో కథానాయకుడి డైలాగ్‌ ఇది! తెల్లారిలేచింది మొదలు... రాత్రి కలలో కూడా ఆయనకు కనిపించేది ‘అప్పులే’! ఎలా, ఎవరి నుంచి, ఎంత కొత్త పద్ధతుల్లో అప్పులు తెచ్చుకోవడంపైనే ధ్యాస! రాష్ట్ర ప్రభుత్వానిదీ అచ్చంగా ఇదే పరిస్థితి! అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తేవడం ఇప్పటిదాకా చూశాం! తాజాగా... సర్కారు వారి రుణ పురాణంలో కొత్త అధ్యాయం మొదలైంది. అది... ‘మీ అప్పులు తీర్చాలంటే మాకు అప్పు ఇప్పించండి!’

సర్కారు వారి సరికొత్త ఆఫర్‌

నాలుగు బడా కంపెనీలకు సూచన

బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న సంస్థలు

గతంలోనూ ఒక కంపెనీకి ఇదే సలహా

మూడుసార్లు అప్పు ఇప్పించిన ఆ కంపెనీ

అయినా.. చిల్లిగవ్వ బిల్లూ రాలేదు

రూ.1.85 లక్షల కోట్లకు చేరిన పెండింగ్‌

కొత్త అప్పులు పుట్టక సతమతం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అక్షరాలా లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు (రూ.1,85,000 కోట్లు).. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు ఇవి! రిటైరైన ఉద్యోగుల నుంచి వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీల వరకు... బాధితుల జాబితాకు అంతే లేదు. ఇందులో దాదాపు 2 లక్షల మంది బాఽధితులు పెండింగ్‌ బిల్లుల కోసం కోర్టులను ఆశ్రయించారు. మరికొందరు ఆర్థిక శాఖ చుట్టూ, ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఫలితం శూన్యం! బడా బడా కంపెనీల ప్రతినిధులు తమకు రావాల్సిన భారీ బిల్లుల కోసం ప్రభుత్వ పెద్దలను, ఆర్థిక శాఖ అధికారులను తరచూ కలుస్తున్నారు. ఇలా భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండి, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నాలుగు బడా కంపెనీలకు చరిత్రలో కనీవినీ ఎరుని రీతిలో ఆర్థిక శాఖ అధికారులు ఓ ‘ఆఫర్‌’ ఇచ్చారు. ‘‘మీ పరపతి ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇప్పించండి. ఆ అప్పు ఇలా మా చేతిలో పడగానే.. ఇలా మీకు బిల్లులు చెల్లిస్తాం’’ అని బేరం పెడుతున్నారు. ఏదో ఒకలా బిల్లులు క్లియర్‌ అయితే చాలనుకుంటున్న ఆ కంపెనీల ప్రతినిధులు... ప్రభుత్వానికి అప్పు ఇప్పించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. అసలు విషయమేమిటంటే... ఇలాంటి ఆఫర్‌లు గతంలోనూ ఒకటి రెండు కంపెనీలకు ఇచ్చారు. ‘నిజమే కాబోలు’ అనుకుని ఆ కంపెనీలు తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వానికి అప్పు ఇప్పించాయి. కానీ... బిల్లులు మాత్రం రాలేదు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే కంపెనీకే ఈ అనుభవం ఎదురైంది. ఆ కంపెనీ ఇలా మూడుసార్లు మోసపోయింది. దీంతో ప్రస్తుతం ఆ సంస్థ ఏపీకి దూరంగా... పక్క రాష్ట్రాల్లో పనులు చేసుకుంటోంది.

కొత్త అప్పులు పుట్టక తిప్పలు...

రెండు నెలల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక మంత్రి, ఇతర ఎంపీలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నా కొత్త అప్పులకు అనుమతి పుట్టడంలేదు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఎన్‌సీడీలు (నాన్‌కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) జారీ చేసి రూ.40వేల కోట్లు అప్పు తెచ్చుకోవాలన్న ప్రయత్నమూ ఫలించడంలేదు. తొలి విడత తెచ్చుకున్న రూ.8300 కోట్లనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేయడం, అది వివాదాస్పదం కావడంతో ఈ కార్పొరేషన్‌కు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీంతో బ్యాంకుల చుట్టూ తిరిగి లాభం లేదనుకున్న రాష్ట్ర ప్రభుత్వం... అప్పులు ఇప్పించే ‘బాధ్యత’ను నాలుగు బడా కంపెనీలకు అప్పగించినట్లు తెలిసింది.

కొండలా పెండింగ్‌

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌ బిల్లుల మొత్తం రూ.1,85,000 కోట్లకు చేరుకుంది. 2022 మార్చి 31 నాటికి లక్షన్నర కోట్లు ఉండగా... ఏప్రిల్‌ నుంచి డిసెంబరుకు మరో రూ.35వేల కోట్లు జతయ్యాయి. ఈ త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 రోజులపాటు ఓడీలో ఉంది. త్వరగా ఓడీ నుంచి బయటకు రాకపోతే రాష్ట్రంలో చెల్లింపుల వ్యవస్థను స్తంభింపజేస్తామని ఆర్‌బీఐ ఇప్పటికే 2 సార్లు రాష్ట్రానికి లేఖలు రాసింది. నవంబరు నెల జీతాలు, పెన్షన్లను జగన్‌ ప్రభుత్వం డిసెంబరు 22 తేదీ గురువారం నాటికి గాని పూర్తిస్థాయిలో చెల్లించలేకపోయింది. జీతాల పరిస్థితే ఇలా ఉంటే... పెండింగ్‌ బిల్లుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు!

Updated Date - 2022-12-26T10:32:45+05:30 IST