విద్యావేదన
ABN , First Publish Date - 2022-10-17T06:42:17+05:30 IST
జిల్లాలోని ఓ కాలేజీలో గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన ద్వారా అందే ఫీజు రీయింబర్స్‌మెంటే అతడి చదువుకు ఆధారం.
విద్యార్థులకు విద్యాదీవెన వెతలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అయోమయం
నూతన విధానంతో విద్యార్థులకు అగచాట్లు
పేరుకుపోతోన్న కళాశాల ఫీజుల బకాయిలు
బకాయిల కోసం యాజమాన్యాల నుంచి ఒత్తిడి
క్యాంపస్ సెలక్షన్లు, పరీక్షల నేపథ్యంలో హెచ్చరికలు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 వేల మందిపై ప్రభావం
విద్యా దీవెన.. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరికి ఇస్తారో తెలియదు. ఏ నిబంధన పెట్టి ఎగ్గొడతారో తెలియదు. సరే అర్హులకు అయినా సకాలంలో అందుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. మొత్తంమీద విద్యా దీవెనపై ఆధారపడి చదువులు కొనసాగిస్తున్న విద్యార్థుల వెతలు అన్నీఇన్నీ కావు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 వేల మంది విద్యార్థులు విద్యాదీవెన కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి దీవెన ఎప్పుడు అందుతుందో తెలియక ఒకవైపు.. ఫీజులు చెల్లించాల్సిందేననే కళాశాల యాజమాన్యాల హెచ్చరికలు మరోవైపుతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో కళాశాలలు తెరిచిననాడు ఫీజు కడితే తప్ప లోపలికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ఫీజుల బకాయిలు చెల్లిస్తే తప్ప వారు కాలేజీల నుంచి బయటపడటం.. క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఉండగా తీవ్ర మనోవేదనతో వారి తల్లిదండ్రులు ఉన్నారు.
- ఆంధ్రజ్యోతి - గుంటూరు
జిల్లాలోని ఓ కాలేజీలో గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన ద్వారా అందే ఫీజు రీయింబర్స్‌మెంటే అతడి చదువుకు ఆధారం. కిందటేడాది విద్యాదీవెన పూర్తిగా రాలేదు. అతడు కళాశాలకు ఫీజు బకాయి పడ్డాడు. దీనికి ఫైనలియర్ రీయింబర్స్‌మెంటు కూడా తోడైంది. దీంతో ఫీజు బకాయి కోసం కళాశాల యాజమాన్యం అతడిపై ఒత్తిడి పెంచింది. విద్యాదీవెన రాగానే ఫీజు చెల్లిస్తామన్నా అంగీకరించలేదు. విద్యాదీవెనతో సంబంధం లేదు.. ఫీజు చెల్లించాల్సిందే అని పట్టుపట్టారు. ఫీజు లేకుంటే క్యాంపస్ ఇంటర్వూలకు పంపేది లేదని, పరీక్షలకు అనుమతించమని హెచ్చరిస్తున్నారు. దీంతో చేసేది లేక అప్పు చేసి ఫీజు చెల్లించాల్సి వచ్చింది.
- ఇది ఈ ఒక్క విద్యార్థి పరిస్థితి కాదు. ఉమ్మడి జిల్లాలోని 96 వేల మంది విద్యార్థుల దీనస్థితి ఇది. త్వరలో క్యాంపస్ ఇంటర్వూలు జరగనున్నాయి. కొన్ని ఇంజనీరింగ్ కళాశాల్లో అయితే ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభించారు. అయితే ఈ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలంటే ఫీజులు బకాయిలు ఉండకూడదనే నిబంధనను ఆయా కళాశాలల నిర్వాహకులు విధిస్తున్నారు. విద్యా దీవెన వస్తుందన్నా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. కిందటేడాది బకాయితో పాటు, ఈ ఏడాది టర్మ్ ఫీజులు కూడా చెల్లించాలంటున్నారు. ఏమైనా చేసుకోండి ఫీజు మొత్తం చెల్లిస్తేనే ఇంటర్వ్యూలకు హాజరు అన్న నిబంధనతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. విద్యాసంవత్సరం మొదలవడంతోపాటే విద్యార్థులకు విద్యాదీవెన వెతలు మొదలయ్యాయి. జగనన్న విద్యా దీవెన సకాలంలో అందకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు ముసురుకున్నాయి. సాధారణ డిగ్రీ విద్యార్థుల ఇబ్బందులు ఒకెత్తయితే, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ వంటి టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థుల పరిస్థితి మరో ఎత్తు. వేలల్లో ఫీజులుండడంతో టెక్నికల్ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇక చివరి విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థులపై ఒత్తిడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పేరుతో తీసుకొచ్చిన కొత్త రీయింబర్స్మెంట్ విధానమే దీనికంతటికీ కారణమని వారు వాపోతున్నారు.
పాత పథకానికే కొత్త హడావుడి
ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజులు చెల్లిస్తామని జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టేప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. అయినా ఆర్భాటంగా తన పేరుతో ‘జగనన్న విద్యాదీవెన’ అంటూ హడావుడి చేశారు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందన్న ఆశతో చాలామంది నిరుపేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సుల్లో చేరారు. తీరా పథకం మొదలయ్యాక కోతలు, ఏరివేతలతో ప్రభుత్వం విద్యార్థులకు షాకుల మీద షాకులు ఇస్తూ వచ్చింది. రకరకాల నిబంధనలను తెరపైకి తీసుకువచ్చి మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 20 వేల మంది విద్యాదీవెనకు దూరం కావాల్సి వచ్చింది. విద్యార్థి కుటుంబానికి 10 ఎకరాలలోపు మాగాణి లేదా 25 ఎకరాలలోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాలలోపే ఉండాలని, పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండరాదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదని, ఆదాయపు పన్ను చెల్లింపుదారు కారాదని, పెన్షనర్లు ఉండకూడదని.. ఇలా సవాలక్ష నిబంధనలు పెట్టి విద్యార్థులను పఽథకానికి దూరం చేసింది. దీంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని చెప్పి మరో 10 వేల మందికి టోకరా ఇచ్చింది.
కొత్త విధానంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి
కిందటేడాది రావాల్సిన విద్యాదీవెన సగం మాత్రమే వచ్చింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి రెండు విడతల విద్యాదీవెన పెండింగులో ఉంది. గతంలో విద్యార్థుల ఫీజులను ఆయా కళాశాలలకే నేరుగా ప్రభుత్వం చెల్లించే పద్ధతి ఉండేది. ఈ విధానం కారణంగా యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజులు అడిగే అవకాశమే ఉండేది కాదు. దీంతో ఫీజుల విషయం పట్టించుకోకుండా విద్యార్థులు చదువులపై దృష్టి సారించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అపసవ్య విధానం కారణంగా నేరుగా విద్యార్థే ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తల్లుల ఖాతాలో విద్యా దీవెన పేరుతో ఫీజులు వేసే విధానం కారణంగా కళాశాల ఫీజుకు విద్యార్థి కుటుంబానిదే బాధ్యత అయ్యింది. అంటే ఫీజులు విద్యార్థి కుటుంబమే చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం విద్యాదీవెన బకాయిలు పెట్టినా దానితో సంబంధం లేకుండా తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి, అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇదే అదనుగా యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే కళాశాలలోకి రానిస్తామని, క్యాంపస్ సెలక్షన్స్‌కు, పరీక్షలకు అనుమతిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.