రాజధానికి..శ్రీవారి శోభ
ABN , First Publish Date - 2022-06-09T05:59:00+05:30 IST
మండలంలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
రాజధానిలో నేడు వేంకటేశ్వరుని ఆలయ ప్రారంభం
మహా సంప్రోక్షణకు హాజరుకానున్న గవర్నర్, సీఎం
తుళ్లూరు, గుంటూరు, జూన్ 8: మండలంలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం తిరువంజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశేష హోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిపించారు.
గవర్నర్, సీఎం రాకకు ఏర్పాట్లు
గురువారం ఉదయం జరిగే విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలకు గవర్నర్ విశ్వభూసన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, స్వరూపానందేంద్ర స్వామి హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎప్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వారు భోజన సదుపాయం కల్పించారు. భక్తులకు కోసం జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. 400 మంది శ్రీవారి సేవకులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పెద్ద సంఖ్యలో మోహరించిన బలగాలు
సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తొలిసారిగా రాజధానిలో పర్యటిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బందోబస్తును ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కొద్ది సంవత్సరాలుగా రాజధాని ప్రాంతంలో రైతులు, ఆందోళన కార్యక్రమలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను మంగళవారమే భారీగా పోలీసు బలగాలు రాజధాని ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం రోడ్డు మార్గం ద్వారా వస్తున్న నేపథ్యంలో దారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయటంతోపాటు ఆయా మార్గాల్లో రాకపోకలను దారిమళ్లించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ట్రయల్‌రన్ నిర్వహించారు. అదేవిధంగా నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌ఓ అదనపు ఎస్పీ అనిల్‌కుమార్, డీఎస్పీలు జెస్సీ ప్రశాంతి, స్రవంతిరాయ్, సీతారామయ్య, పోతురాజు, రమణకుమార్, ప్రకాష్‌బాబు, మోజెస్‌పాల్, సీఐలు బాలసుబ్రహ్మణ్యం, ఎం.శ్రీనివాసరావుతోపాటు పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.