నిలకడగా వరద
ABN , First Publish Date - 2022-08-14T05:09:48+05:30 IST
కృష్ణానదికి వరద ఉధృతి శనివారం నిలకడగా కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఉధృతంగా ప్రవహించిన వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

లోలెవల్ చప్టాలపై తొలగని నీరు
భట్టిప్రోలు, కొల్లూరు, ఆగస్టు 13: కృష్ణానదికి వరద ఉధృతి శనివారం నిలకడగా కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఉధృతంగా ప్రవహించిన వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో లంక గ్రామాల రైతులు బెంబేలెత్తిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచి ప్రవాహం నిలకడగా కొనసాగుతూ తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు చిన్నరేవులో పెసర్లంక - ఓలేరు, పెసర్లంక - పెదపులివర్రు, పెసర్లంక - కోళ్ళపాలెం గ్రామాల మధ్యన లోలెవల్ చప్టాలపై వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో లంక గ్రామాలకు, పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరివాహక లోతట్టు భూముల్లో నీరు తిష్ఠవేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న సమాచారంతో లంక గ్రామాల రైతులు ఒకింత సేదతీరారు. బ్యారేజీ దిగువ నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుతుంది. శనివారం ప్రవాహం సుమారు 2 అడుగులకు పైగా తగ్గింది. అయితే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉండటంతో భారీ వర్షాలు కురిస్తే వరద భారీగా రావచ్చని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి గండం గట్టెక్కడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.