కృష్ణమ్మ ఉధృతం

ABN , First Publish Date - 2022-10-17T06:38:15+05:30 IST

భారీ వర్షాలు.. ఎగువ నుంచి వస్తోన్న ప్రవా హంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. ఆదివారం కూడా నదిలో ప్రవాహం ఉధృతం గా ఉంది.

కృష్ణమ్మ ఉధృతం
కొల్లిపర వద్ద వరద నీటిలో పంట పొలాలు

క్రమక్రమంగా పెరుగుతున్న వరద

లోతట్టు పొలాల్లోకి నీరు.. కోతకు గురవుతున్న కట్టలు

ప్రకాశం బ్యారేజి నుంచి 5 లక్షల క్యూసెక్కులు విడుదల


కొల్లూరు, భట్టిప్రోలు, బాపట్ల, అక్టోబరు 16: భారీ వర్షాలు.. ఎగువ నుంచి వస్తోన్న ప్రవా హంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. ఆదివారం కూడా నదిలో ప్రవాహం ఉధృతం గా ఉంది. ప్రకాశం బ్యారేజి   రిజర్వాయర్‌లో 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు 5 లక్షల 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. దీంతో సాగరం దిశగా కృష్ణమ్మ పొంగి ప్రవహి స్తోంది. దీంతో బ్యారేజికి దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాలు, లంకవాసులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. నీటి ప్రవాహ ఉధృతికి కట్టలు కోసుకుపోతు న్నాయి. కొల్లూరు మండలంలోని లంక గ్రామా ల్లోని మెరక భూముల్లోకి సైతం వరద నీరు పొటెత్తింది. దీంతో గాజుల్లంక, పోతార్లంక, చిం తల్లంక, సుగ్గునలంక, ఈపూరులంక గ్రామాల పరిధిలో అరటి, కంద, పసుపు, వాణిజ్య పంటలతో పాటు కూరగాయ పంటలు సైతం వరద నీటిలో మునిగాయి. మినుము పంట వరద నీటిలో పూర్తిగా మునిగి కొన్ని చోట్ల  ఆనవాళ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. నీటి ఉధృతికి విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు వాలిపోయాయి. నీటిలో 24 గంటలు ఉంటే  కంద, పసుపు, మినుము పైర్లు పనికి రాకుం డా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భట్టిప్రోలు మండలంలోని పెదలంక కాకులడొంక, ఓలేరు పల్లెపాలెం గ్రామాల వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఓలేరు పల్లెపాలెం వద్ద 16 అడుగుల మేర వరద నీరు నురగలు కక్కుతూ సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది. పసుపు, కంద, అరటి, తమలపాకు పంటలు నీటిలో నాని ఉండడంతో ఉరకెత్తి కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. వెల్లటూరు చిన్నరేవు,  ఓలేరు - పెసర్లంక, కోళ్ళపాలెం - పెసర్లంక, పెదపులివర్రు - పెసర్లంక, పెదపులివర్రు - చింతమోటు గ్రామాల మధ్యన ఉన్న లోలెవల్‌ చప్టాలపై వరద నీరు 3 అడుగులకు పైగా ప్రవహిస్తుంది. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పర్యటిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నది.   


పొంగి ప్రవహిస్తున్న డ్రెయినేజీలు 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో బాపట్ల పరిసరాల్లోని డ్రెయిన్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్లమడ, ఈస్ట్‌ తుంగభద్ర, పేరలి, తెనాలి డ్రెయిన్లలో వరదనీరు పరవళ్లు తొక్కుతున్నది. నీటి ప్రవహానికి బలహీనంగా ఉన్నచోట కట్టలు కోతకు గురవుతున్నాయి. 


Updated Date - 2022-10-17T06:38:15+05:30 IST