వరదొస్తే.. వెళ్లేదలా?

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

భారీ వర్షాలు కురిస్తే పల్లపు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వరద నీటి కాలువలతో పాటు ప్రధాన మురుగుకాలువల్లో పూడికతీత పనులు వర్షాలకు ముందు నిర్వహించాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులదే.

వరదొస్తే.. వెళ్లేదలా?
నరసరావుపేటలో జమ్ముతో పూడి పోయిన ప్రధాన వరద నీటి కాలువ

పూడిపోయిన వరద నీటి కాలువలు

వర్షాలొస్తున్నా పూడిక తీతకు నోచుకోని వైనం 

భారీ వర్షం కురిస్తే పల్లపు ప్రాంతాలు మునకే 

చోద్యం చూస్తున్న మునిసిపల్‌ అధికారులు


వర్షాలొస్తున్నాయి.. ఇప్పట్లో వీడేలా లేవు.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే జిల్లా కేంద్రమైన నరసరావుపేటవాసులతో పాటు ఇతర మున్సిపాలిటీల్లోని ప్రజలు మాత్రం వానొస్తుందంటే భయపడిపోతున్నారు. పూడికతో నిండి పూడిపోయిన కాల్వలు ఒకవైపు.. వర్షపు నీరు పోయే మార్గం లేక ముంపునకు గురయ్యే ప్రమాదం మరోవైపుతో వణికిపోతున్నారు. ఏటా వర్షాల సమయంలో పట్టణాల్లోని ప్రధాన రహదారులతో పాటు వివిధ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ సమయంలో హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. వర్షాలకు ముందే వరద నీటి ప్రవాహ కాల్వలను గుర్తించి పూడిక తొలగించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కారణంగా వర్షాల సమయంలో ముంపు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.


ఈ పనులు చేయాలి..

- పూడిపోయిన కాలువలను పునరుద్ధరించాలి. 

- వరద నీరు సులువగా కాలువల్లో ప్రవహించే విధంగా చర్యలు చేపట్టాలి.

- ప్రధాన మురుగు కాలవల్లో ప్రారంభం నుంచి చివరి వరకు పూడిక తీయాలి. 

- కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చర్యలు తీసుకోవాలి.

- కాలువల్లో పెరిగిన జమ్ము, నాచు తొలగించాలి. 


నరసరావుపేట, జూలై 18: భారీ వర్షాలు కురిస్తే పల్లపు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వరద నీటి కాలువలతో పాటు ప్రధాన మురుగుకాలువల్లో పూడికతీత పనులు వర్షాలకు ముందు నిర్వహించాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులదే.  గతంలో ఏఏ ప్రాంతాలు వరద నీటితో ముంపునకు గురయ్యాయో, గురవుతాయో గుర్తించి ఆయా ప్రాంతాల్లో కాలువలను అభివృద్ధి చేయాలి. కాని జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏటా భారీ వర్షాలు కురిస్తే పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వర్షాకాలం ముందస్తు పనులు చేపట్టడాన్ని అధికారులు విస్మరించారు. ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురిస్తే పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నా పురపాలకులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. ఆయా పనుల కోసం మునిసిపాలిటీలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఇంజనీరింగ్‌, ప్రణాళిక, పారిశుధ్య విభాగాల అధికారులు కమిటీగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలి. అయితే కాలువల్లో పూడికతీత పనులు ఇంకా చేపట్టకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. వరదల సమయంలో ముంపునకు గురయ్యే గృహాల వారికి సాయం అందించే కన్నా ముందస్తు చర్యలు తీసుకోవడం మిన్న అనే అంశాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ఈ కారణంగానే ఏటా పేదలు పట్టణవాసులు వరద ముంపు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాదైనా ఈ పరిస్థితుల నుంచి పేదలను గట్టెక్కించేందుకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ళ మున్సిపాల్టీలు, దాచేపల్లి, గురజాల నరగపంచాయతీలలో పల్లపు ప్రాంతాల ముంపు నివారణ చర్యలు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.


జిల్లా కేంద్రం నరసరావుపేటలో...

నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో వరద నీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పల్నాడు రోడ్డు నుంచి కత్తవ చెరువు వరకు ఉన్న ప్రధాన కాలువలో జమ్ము పెరిగింది. నీటి ప్రవాహానికి ఇది అడ్డంకిగా మారనుంది. అలాగే సత్తెనపల్లి, వినుకొండ, గుంటూరు, పల్నాడు రహదారుల్లోని ప్రధాన మురుగు కాలువలు పూడికతో పూడిపోయాయి. వీటిలో నీరు ప్రవహించే పరిస్థితి లేదు. చిన్న వర్షానికే నీరు కాలువల్లో ప్రవహించక పోవడంతో రోడ్డు మార్జిన్‌లు అధ్వానంగా తయారవుతున్నాయి. రోడ్లపై పడే వర్షపు నీరు కాలువల్లో ప్రవహించాల్సి ఉండగా ఈ పట్టణంలో కాలువల్లో నీరు రోడ్ల పైకి ప్రవహిస్తున్నది. ప్రధాన కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పురపాలకులు వరద నీటి కాలువలు, ప్రధాన మురుగు కాలవల్లో పూడిక తీసే పనులు చేపట్టక పోవటం గమనార్హం. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వందలాది గృహాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ సంఘటన నుంచి అధికారులు ఇంకా పాఠం నేర్చకోక పోవడం గమనార్హం. కాలువలను ఇలానే వదిలేస్తే భారీ వర్షం కురిస్తే ఈ ఏడాది కూడా పల్లపు ప్రాంతాలు మునకెత్తే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. యంత్రాలు అందుబాటులో ఉన్నా పూడిక తీత పనులు చేపట్టక పోవడం మునిసిపాలిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియ జేస్తుంది. 


 

Updated Date - 2022-07-18T05:30:00+05:30 IST