కడుతున్నారు.. కూలుతున్నాయి
ABN , First Publish Date - 2022-12-15T00:11:04+05:30 IST
టిడ్కో గృహాలు అంటేనే ప్రస్తుత పాలకులకు నిర్లక్ష్యమా అంటే పరిస్థితులు చూస్తే అలానే ఉంది.
నాసిరకంగా టిడ్కో గృహాల వద్ద నిర్మాణాలు
వినియోగంలోకి రాకుండానే విరిగిన కాల్వల గోడలు
డిజైన్లలో లోపాలున్నా అదే తీరుగా నిర్మాణ పనులు
మొక్కుబడిగా తనిఖీలు.. అధికారుల పర్యవేక్షణ నిల్
నరసరావుపేట, డిసెంబరు 14: టిడ్కో గృహాలు అంటేనే ప్రస్తుత పాలకులకు నిర్లక్ష్యమా అంటే పరిస్థితులు చూస్తే అలానే ఉంది. టీడీపీ హయాంలో పూర్తి అయిన టిడ్కో ఇళ్ల ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పనే మిగిలింది. అయినా మూడున్నరేళ్లుగా వాటిని మూలన పెట్టేశారు. టిడ్కో ఇళ్లు శిథిలమవుతున్నాయని ఒకవైపు ప్రతిపక్షాలు.. మరోవైపు లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నా నిర్లక్ష్యధోరణిలో ఉంది. ఎట్టకేలకు మౌలిక వసతులకు నిధులు మంజూరు చేసినా ఆ పనులు నాసిరకరంగా జరుగుతున్నాయి. రూ.కోట్ల వ్యయంతో పది కాలాల పాటు ఉండాల్సిన పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఓ వైపు పనులు జరుగుతుండగానే మరోవైపు కూలిపోతున్నాయంటే ఎంత దారుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. పది కాలాల పాటు ఉండాల్సిన ప్రగతి పనులు పట్టుమని పది రోజులు కూడా ఉండటంలేదు. నరసరావుపేటలోని టిడ్కో గృహాలకు మౌలిక వసతుల్లో భాగంగా నిర్మించిన మురుగు కాలువలు వినియోగంలోకి రాకుండానే పడిపోయాయి. నరసరావుపేటలో గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన 1504 గృహాలకు మౌలిక వసతుల పనులు చేపట్టారు. తాగునీటి వసతి, మురుగు కాల్వలు, రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. టిడ్కో ప్రాంగణంలో రూ.6.33 కోట్లతో చేపట్టిన పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. కాంక్రీట్‌తో కాల్వల నిర్మాణం చేపట్టారు. గృహాలకు వెళ్లే మార్గంలో ఓ వైపు టిడ్కో, మరో వైపు మున్సిపాల్టీ ఆధ్వర్యంలో కాల్వల నిర్మాణాలు జరుగుతున్నాయి. టిడ్కో శాఖ నిర్మించిన కాల్వకు ఓ వైపు కాంక్రీట్ గోడ పూర్తిగా నెలమట్టమైంది. అలాగే టిడ్కో గృహాల మొదటి రహదారిలో నిర్మించిన మురుగు కాల్వకు ఓ పైపు కాంక్రీట్ గోడ పూర్తిగా పడిపోయింది. నాసిరకంగా పనులు జరగడం వల్లే కాల్వల గోడలు పడిపోయాయని చెప్పవచ్చు. మరో మూడు ప్రధాన రోడ్లు, అడ్డరోడ్లకు కూడా మురుగు కాల్వలను నిర్మించారు. ఇవి కూడా పడిపోయిన కాల్వల తరహాలోనే పనులు జరిగినట్లు టిడ్కో శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. పడిపోయిన కాల్వల కాంక్రీట్ దిమ్మెలను గుట్టుచప్పుడు కాకుండా తొలగించి వేరే ప్రాంతానికి తరలించడం గమనార్హం.
నాణ్యతను పరిశీలించకుండానే..
పడిపోగా మిగిలిన కాల్వల పనులకు సంబంధించి నాణ్యత పరిశీలించాలి. అయితే వాటిని పట్టించుకోకుండా అదే డిజైన్ ప్రకారం, అదే రకం మెటీరియల్‌ను వినియోగించి మిగిలిన కాల్వలను కూడా నిర్మించారు. డ్రెయిన్లు కూలిపోవడానికి డిజైన్‌లో లోపాలు కూడా ఓ కారణమని అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ తరహా లోపాలు ఉంటే ఉన్న కాల్వలు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ విభాగం మొక్కుబడిగా పరిశీలించినట్లు విమర్శలున్నాయి. నిర్మాణం పూర్తయిన కాల్వలకు సంబంధించి నాణ్యతను పరిశీలించి నాసిరకం పనులు తొలగించి తిరిగి నిర్మించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. టిడ్కో అధికారులు మధ్య సమన్వయ లోపం ఉండటం కూడా నాసిరకంగా పనులు జరగడానికి కారణంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నాసిరకంగా పనులు జరుగుతున్నా స్పందించక కాంట్రాక్టర్ పంచన చేరిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.