అయినవారి కోసం.. అడ్డదారులు
ABN , First Publish Date - 2022-06-28T05:12:08+05:30 IST
మున్సిపల్ పనుల అప్పగింతకోసం కాంట్రాక్టు పద్దతిలో టెండర్ పిలవటమో, మరీ అత్యవసరమైతే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించటమో చూసి ఉంటారు. కానీ లాటరీ పద్దతిలో పనులు పందేరం చేయటం ఎక్కడైనా చూశారా! తెనాలి మున్సిపాలిటీలో ఈ వింత ఆచారానికి ప్రాధాన్యమిచ్చారు.

తెనాలి మున్సిపల్ పనుల్లో... ఒక్కరికే ’లాటరీ’ యోగం
ఇది అదృష్టమా!... మున్సిపల్ అధికారుల మాయా!
విద్యుత్ దీపాల సరఫరాకు వింత పద్ధతి
తెనాలి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పనుల అప్పగింతకోసం కాంట్రాక్టు పద్దతిలో టెండర్ పిలవటమో, మరీ అత్యవసరమైతే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించటమో చూసి ఉంటారు. కానీ లాటరీ పద్దతిలో పనులు పందేరం చేయటం ఎక్కడైనా చూశారా! తెనాలి మున్సిపాలిటీలో ఈ వింత ఆచారానికి ప్రాధాన్యమిచ్చారు. పైగా మూడు పనులను అప్పగించేందుకు కాంట్రాక్టర్ల పేర్లు లాటరీ తీస్తే ఒక వ్యక్తిపేరే రావటం మరీ విడ్డూరంగాలేదూ!. నవ్విపోదురుకాక మాకేంటి అనుకున్నారో!. ఏం చెప్పినా ఎదురు అడిగేవారెవరున్నారనుకున్నారో కానీ, తెనాలి మున్సిపల్ టెండర్ల వ్యవహారంలో, ప్రజాధనానికి ఇచ్చే భద్రత విషయంలో బరితెగింపు పద్ధతిలో వ్యవహరించటం పలు విమర్శలకు తావిస్తోంది. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డులో ఆర్డీసీ బస్టాండ్ వెనుక కొత్తగా నిర్మించిన డివైడర్లపై హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ చుట్టూ ఏర్పాటు చెయ్యాల్సిన వీధి దీపాలకోసం, 1 నుంచి 10, 21వ వార్డు నుంచి 34 వార్డు వరకు, 35 నుంచి 40 వార్డులలోని వీధుల వెంట ఎల్.ఇ.డి స్ట్రీట్ లైట్ల ఏర్పాటు చేసేందుకు 20, 45, 90 వాట్ల లైట్లు సరఫరా చేసేలా అంచనాలు తయారుచేశారు. ఆ మొత్తాన్ని వారికి అనుకూలంగా పనిని మూడు భాగాలు విభజించి రూ. 4.99 లక్షల చొప్పున రూ. 15 లక్షలకు సంబందించిన పనులను టెండర్లు పిలవకుండా అప్పనంగా ఇచ్చేసేందుకు రంగం సిద్దం చేశారు. దీనికోసం అసిస్టెంట్ ఇంజనీర్లు ఇద్దరు కష్టపడి అంచనాలు సిద్దంచేశారు. అఽయితే ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమవారికి అప్పగించాలనుకున్నారో! లేక ఏదైనా సిఫార్సులకు తలొగ్గారో కానీ, ఏకంగా లాటరీ పద్దతిలో పనులు ఒక్కరికే అప్పగించేశారు. 37వ వార్డులో కొత్తగా డివైడర్లను నిర్మించారు. ఆ పనులతోపాటే టెండర్లు పిలిచే అవకాశం ఉన్నా, హైమాస్ట్ లైట్లకోసం పనులు చేసేశాక అత్యవసరం పేరుతో లాటరీ ద్వారా పనులు అప్పగించటం విమర్శలకు తావిస్తోంది. పైగా మున్సిపల్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉంటే వారిలో ఒక్కరినే లాటరీ వరించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ అంశాలను ఆమోదం కోసం ఏకంగా మున్సిపల్ ఎజెండాలో చేర్చటం చూస్తే, కౌన్సిలర్ల చిత్తశుద్ధ్దికి పరీక్షపెట్టినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి, మే, జూన్ నెలల్లోనే ఈ మూడు కాంట్రాక్టు పనులను ఛైర్పర్సన్ ముందస్తుగా రాటిఫై చేయటం మరో విశేషం. అయితే మంగళవారం జరగనున్న కౌన్సిల్ల దీనిని ఆమోదించాల్సి ఉంది. అయితే అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆమోదిస్తారో! వ్యతిరేకిస్తారో చూడాల్సిందే.