స్టేషన్ ఎదుట తిరిగారని అరెస్టు
ABN , First Publish Date - 2022-12-15T00:35:25+05:30 IST
పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైక్‌లపై తిరిగారని ఇద్దరు కార్యకర్తలను వెల్దుర్తి పోలీసులు అరెస్టు చేయడంతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది.
పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ ఆందోళన
పోలీసుల వ్యాఖ్యలపై బ్రహ్మారెడ్డి ఆగ్రహం
వెల్దుర్తి, డిసెంబరు 14: పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైక్‌లపై తిరిగారని ఇద్దరు కార్యకర్తలను వెల్దుర్తి పోలీసులు అరెస్టు చేయడంతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన రాయనూతల కిషోర్ ఇంట్లో ఓ శుభకార్యానికి టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి రాక సందర్భంగా ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో చాగంటి ఏసోబు, మాచర్ల చంద్రయ్య ద్విచక్ర వాహనాలపై సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఏసోబు తల్లి ఆరోగ్యమ్మ, భార్య మనోరమలు స్టేషన్‌కు చేరుకుని తమ వారిని ఎందుకు అరెస్టు చేశారని బైఠాయించారు. ఈ క్రమంలో మనోరమ్మ సొమ్మసిల్లి పడిపోగా విషయం తెలుసుకున్న బ్రహ్మారెడ్డి పార్టీ నేతలతో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తల అరెస్టుపై బ్రహ్మారెడ్డి ప్రశ్నించగా పదేపదే ద్విచక్ర వాహనాలతో స్టేషన్ ముందు సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. కాలనీకి వెళ్లాలంటే స్టేషన్ ముందు నుంచే వెళ్లాల్సి ఉంది.. అంతమాత్రానికే అరెస్టు చేసి కొడతారా అంటూ ఆయన ఎస్‌ఐపై మండిపడ్డారు. పోలీసులు చిన్న విషయాలను పెద్దవిగా చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూడడం సరైంది కాదన్నారు. టీడీపీ సానుభూతిపరులను ఏదోక కారణం చూపి స్టేషన్‌కు పిలిపించడం, కొట్టడం వంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. మొదట ద్విచక్ర వాహనాలపై సౌండ్ చేస్తే కేసులు నమోదు చేశామని చెప్పిన పోలీసులు తర్వాత డ్రంకెన్ డ్రైవ్ అని చెబుతున్నారన్నారు. అరెస్టుపై అడిగిన మహిళలను మగాళ్లు లేరా అంటూ పోలీసులు హేళనగా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. న్యాయం కోసం మగాళ్లే కావాలా.. మహిళలు పనికి రారా అని బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : సీఐ
స్టేషన్ వద్ద ఆందోళనతో మాచర్ల రూరల్ సీఐ సమివుల్లాఖాన్ అక్కడకు చేరుకుని కార్యకర్తలందరినీ పంపించివేయాలని బ్రహ్మారెడ్డిని కోరారు. ఘటనపై విచారణ జరుపుతామన్న హామీతో కార్యకర్తలు వెనుదిరిగివెళ్లారు. వాహనాల సైలెన్సర్లను తొలగించి శబ్ధాలు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని విలేకర్లకు తెలిపారు.