పల్నాట.. మినీ సందడి

ABN , First Publish Date - 2022-10-02T06:14:04+05:30 IST

ఒంగోలులో మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో టీడీపీ నాయకులు ప్రతీ జిల్లాలో మినీ మహానాడులను నిర్మహిస్తున్నారు.

పల్నాట.. మినీ సందడి

12న నరసరావుపేటలో మినీ మహానాడు

షెడ్యూల్‌ ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం

విజయవంతానికి నాయకులు సమాయత్తం

హాజరుకానున్న అధినేత చంద్రబాబునాయుడు

నరసరావుపేట, అక్టోబరు 1: ఒంగోలులో మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో టీడీపీ నాయకులు ప్రతీ జిల్లాలో మినీ మహానాడులను నిర్మహిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడులో కూడా మినీ మహానాడు నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు. నరసరావుపేట వేదికగా ఈ నెల 12న మినీ మహానాడు నిర్వహణకు అధిష్ఠానం ఆమోదం తెలిపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకున్నారు. పల్నాడు జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారిగా ఇక్కడకు చంద్రబాబు రానుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.  మినీ మహానాడుకు సంబంధించిన షెడ్యుల్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు  నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కూడా సమాచారం అందింది. మహానాడు జరిగే మరుసటి రోజు 13న చిలకలూరిపేట నియోజకవర్గ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమీక్షకు కూడా అధినేత హాజరవుతారని నాయకులు తెలిపారు.  14న గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యుల్‌ను టీడీపీ  రాష్ట్ర కార్యాలయం విడుదల చేసింది. శుక్రవారం మంగళగిరి సమీపంలోని కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జరిగిన సమీక్షలో కూడా మనీ మహానాడుపై చర్చించారు. పలు జిల్లాల్లో మినీ మహానాడులు విజయవంతమైనట్లుగా నరసరావుపేటలో అంతకుమించి నిర్వహించేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. మహానాడు ద్వారా పల్నాడు జిల్లాలో పార్టీ సత్తాచాటాలని నేతలు భావిస్తున్నారు.  రెండు రోజుల్లో మహానాడుకు వేదిక స్థలం ఖరారు చేసే అవకాశం ఉంది. జిల్లాలో సత్తెనపల్లికి ఇన్‌చార్జిని నియమించడంలో మూడేళ్లుగా అధిష్ఠానం తాత్సారం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో మహానాడు కన్నా ముందుగా సత్తెనపల్లికి ఇన్‌చార్జిని నియమించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.  


Read more