రాజధానిని కాదు.. అభివృద్ధిని వికేంద్రీకరించండి

ABN , First Publish Date - 2022-03-05T05:36:44+05:30 IST

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాల్సిందే... దానిని మొదలెట్టిందే మా తెలుగుదేశం ప్రభుత్వం... అయితే పాలన సౌలభ్యం కోసం పరిపాలన యంత్రాంగాలన్నీ ఒకేచోట వుండాలని టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పునరుద్ఘాటించారు.

రాజధానిని కాదు.. అభివృద్ధిని వికేంద్రీకరించండి
మంగళగిరి ద్వారకానగర్లో పర్యటిస్తున్న లోకేశ్‌కు హరతులిచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

మంగళగిరి, మార్చి 4: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాల్సిందే... దానిని మొదలెట్టిందే మా తెలుగుదేశం ప్రభుత్వం... అయితే పాలన సౌలభ్యం కోసం పరిపాలన యంత్రాంగాలన్నీ ఒకేచోట వుండాలని టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పునరుద్ఘాటించారు. మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం నగరంలోని ద్వారకానగర్‌, ఇందిరానగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇపుడు చేయాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే! రాజధాని వికేంద్రీకరకణ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంయమనం పాటించి గాంధేయమార్గంలో తమ ఉద్యమాన్ని నడిపారని అన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులంటూ రెచ్చగొట్టినా.. ఆడబిడ్డలను బూటుకాళ్లతో తన్నించినా.. ఓర్పుతో శాంతియుత ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ప్రభుత్వ అరాచకాలను సహిస్తూ శాంతియుతంగా పోరాడి చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారంటూ అమరావతి రైతులను ఆయన అభినందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు న్యాయవ్యవస్థను కించపరచడం మాని తీర్పును హుందాగా గౌరవిస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జడ్జిలను కించపరుస్తూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు సోషల్‌ మీడియాలలో అనేక పోస్టులను పెట్టించారు. ఆ కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. ఇప్పుడు అవే తప్పులను చేస్తూ న్యాయవ్యవస్థపై ఇష్టానుసారం కామెంట్లను చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదన్నారు. ఇకనైనా వైసీపీ నేతలు మూడు ముక్కలాటను వీడి ఒక రాష్ట్రానికి ఒక్కటే రాజధాని అన్నదానికి కట్టుబడాలని కోరారు. రాష్ట్రంలో పెనుసంచలనంగా మారిన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో అబ్బాయి జగన్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరుపాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.  


Read more