జీతాలేవీ?

ABN , First Publish Date - 2022-12-12T00:01:00+05:30 IST

తల్లీ, తండ్రీ, గురువు, దైవం అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత అత్యంత గౌరవనీయ స్థానం గురువుదే. అలాంటి గురువును రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజాన్ని పురోగామి పథాన నడిపించే కీలక బాధ్యత నిర్వహించే ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపులతో సర్కారు సాగుతోంది.

జీతాలేవీ?

గుంటూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తల్లీ, తండ్రీ, గురువు, దైవం అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత అత్యంత గౌరవనీయ స్థానం గురువుదే. అలాంటి గురువును రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజాన్ని పురోగామి పథాన నడిపించే కీలక బాధ్యత నిర్వహించే ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపులతో సర్కారు సాగుతోంది. వారిని సారా దుకాణాలకు కాపలాలు పెట్టి, మరుగుదొడ్ల బాధ్యత వంటి బోధనేతర విధులతో వేధించి, ముఖహాజరు పేరుతో అవమానించిన సర్కారు నేడు జీతాలు కూడా ఇవ్వకుండా ఆపేసింది. వేతనాలు ఇచ్చేందుకు సర్కారు వద్ద సొమ్ములు లేవా? సాంకేతిక సమస్యలా? లేక కక్ష సాధింపులా? కారణాలు ఏవన్నా కానీయండి.. ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయులు మాత్రం తీవ్ర మనోవ్యధకు గురవుతున్నారు. ఒకటో తేదీ పోయి పదకొండు రోజులైనా వారు వారి కష్టార్జితాన్ని ఇప్పటికీ కళ్లజూడలేదు. ఈనెల జీతం వారికి వస్తుందో లేదో అని దీనంగా ఎదురుచూస్తున్నారు. వీరికి తోడుగా ఉమ్మడి జిల్లాలో కొంతమంది పెన్షనర్లదీ అదే పరిస్థితి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 15 వేల మంది ఉపాధ్యాయులు, వెయ్యిమంది అధ్యాపకులు ఉన్నారు. వీరిలో 11 వేల మందికి ఇప్పటికీ వేతనాలు రాలేదు. బాపట్ల, పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం 9,500 మంది ఉపాధ్యాయులు, 600 మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి ఈనెల జీతాలు పడలేదు. వీరితోపాటు గుంటూరు జిల్లాలో కొందరికి వేతనాలు రాలేదు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు పడలేదు. గుంటూరులోని పట్నంబజార్‌ యూనియన్‌ బ్యాంకు బ్రాంచి పరిధిలో ఉన్న వందలమంది పెన్షనర్లకు పెన్షన్‌ రాలేదని, బాపట్ల, పల్నాడుల్లో కూడా కొంతమంది విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని పెన్షనర్ల సంఘాలు చెబుతున్నాయి.

అగ్రస్థానం వలంటీర్లకు..

తల్లిదండ్రుల తరువాతి స్థానంలో గౌరవం పొందే అధ్యాపక, ఉపాధ్యాయుల స్థానాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల కంటే దిగువ స్థాయికి నెట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అందరికీ వేతనాలు వచ్చినా ఉపాధ్యాయులకు వేతనాలు రాకపోవడం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఈనెల మూడో తేదీ లోపు వేతనాలు ఇచ్చింది. కాగా సీఎం మానసపుత్రిక అయిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులకు, గౌరవ వేతనాలు తీసుకునే వలంటీర్లకు అగ్రస్థానం ఇచ్చిన ప్రభుత్వం వారికి ఈనెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వడం విశేషం. కాగా ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటివరకూ వేతనాలు ఇవ్వకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. హామీల విషయంలో పదేపదే మోసపోయి గాయపడిన ఉపాధ్యాయులను ప్రభుత్వ చర్యలు మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

జీతాలు చెల్లించకపోవడం అన్యాయం

పదో తేదీ దాటినా నవంబరు నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లుకు పెన్షన్లు చెల్లించకపోవడం అన్యాయమని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌చాంద్‌ బాషా అన్నారు. మెడికల్‌ కళాశాల ఆవరణలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీతాలు అందకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించే విధంగా క్యాబినెట్‌లో చర్చించాలన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు ఒకటో తేదిన చెల్లించే విధంగా అసెంబ్లీలో చట్టం చేసి, అమలు చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు వై.నాగేశ్వరరావు, కరీముల్లా, ప్రసాదు, హుస్సేన్‌ ఖాన్‌, పెదరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:01:12+05:30 IST