సాగర్ కుడి కాలువకు నీటి విడుదల
ABN , First Publish Date - 2022-05-28T05:58:34+05:30 IST
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం శుక్రవారం నీటి విడుదల చేశారు.

విజయపురిసౌత్, మే 27: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం శుక్రవారం నీటి విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు సాగర్ కుడి జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తూ గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల పెంచుతూ సాయంత్రం 4 గంటలకు 3,710 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలను 6 వేల క్యూసెక్కుల వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్ట్ డీఈ మురళీధర్ తెలిపారు. నీటి విడుదల వారం రోజులపాటు కొనసాగనున్నట్లు చెప్పారు. కాగా నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం నాటికి 536.90 అడుగులు ఉంది. ఇది 181.92 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 3,710 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 500, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 4,210 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 4,210 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది.