రూ.37 లక్షలతో ఏంచేశారో?

ABN , First Publish Date - 2022-12-16T00:34:59+05:30 IST

మండలంలోని మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులకు గ్రహణం పట్టింది.

రూ.37 లక్షలతో ఏంచేశారో?
మాడుగుల పీహెచ్‌సీ

మాడుగుల పీహెచ్‌సీకి రంగులతో సరి

నాడునేడు నిధుల వ్యయంపై లెక్కలు మృగ్యం

ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనపై నీలినీడలు

మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యంలేక సిబ్బంది, రోగుల అవస్థ

గురజాలటౌన్‌, డిసెంబరు 15: మండలంలోని మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులకు గ్రహణం పట్టింది. నాడు-నేడు పథకంలో ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, ఆధునికీకరణకు 2020లో రూ.37 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ నిధులు సద్వినియోగమైన దాఖలాలు లేవని అటు రోగులు.. ఇటు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ నిధులతో ఏఏ పనులు చేశారో.. ఆయా పనులకు ఎంతంత వెచ్చించారో అర్థం కావడంలేదంటున్నారు. రెండేళ్ల క్రితం మంజూరైన నిధులతో పీహెచ్‌సీలో మరుగుదొడ్ల నిర్మాణం, పాతవాటికి మరమ్మతులు, ఆస్పత్రి అభివృద్ధి, తాగునీటి సౌకర్యం తదితర పనులను చేయాలి. అయితే కేవలం పీహెచ్‌సీకి రంగులు వేసి, అప్పటికే ఉన్న ప్రహరీ గోడ ఎత్తును మరో రెండు అడుగులు పెంచారు. అటు రోగులు, ఇటు సిబ్బందికి అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పనపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, మరుగుదొడ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. నాడు నేడు నిధులతో పనులు సాగక.. మౌలిక వసతులు లేక రోగులు, వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిధులు ఉన్నా మౌలిక వసతుల కల్పనలో సాగదీతపై ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినప్పటికీ ఫలితం లేదు. నాడు-నేడు కింద మంజూరైన రూ.37 లక్షలతో ఏ పనులు ఏమయ్యాయని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహించలేకపోతున్నాం.. వసతులు కల్పించాలని సిబ్బంది వేడుకుంటున్నా ఎవరికీ పట్టడంలేదు. ఈ నిధులు ఎవరి జేబులోకి పోయాయనేది ప్రశ్నగా మారింది. ఈ పీహెచ్‌సీ పరిధిలో 11 ఉప ప్రాఽఽథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 60 మంది ఆశా వర్కర్లు, 25 మంది ఏఎన్‌ఎంలు, 15 మంది ఇతర సహాయక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి రోజూ ఓపీలు 80 దాకా వస్తున్నాయి. అయితే ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యరపతినేని శ్రీనివాసరావు నేతృత్వంలో 1999లో పీహెచ్‌సీకి శంకుస్థాపన చేసి రెండేళ్లలో ప్రారంభించారు. అప్పట్లో సమకూర్చిన సౌకర్యాలు తప్పించి ప్రస్తుతం కొత్తగా ఎటువంటి వసతులు కల్పించలేదు. పైగా అప్పట్లో నిర్మించిన మరుగుదొడ్లు మరమ్మతులకు గురైనా వాటి గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. టీడీపీ హయాంలో నిర్మించిన మరుగుదొడ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. రోగులు బయట నుంచి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నూతనంగా మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. పైగా ఉన్న వాటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడంలేదు.

సిబ్బంది, రోగులకు ప్రత్యక్ష నరకం

పీహెచ్‌సీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రతి నెలలో మూడు సార్లు పీహెచ్‌సీలో సమావేశమవుతారు. ఈ సమావేశాలకు సిబ్బంది హాజరైనప్పుడు మరుగుదొడ్లు వినియోగంలో లేక ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఇక రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉద్యోగులు, రోగుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇక్కడ నెలకొన్న అసౌకర్యాలు అవస్థలకు గురి చేస్తున్నాయి. డ్రెయినేజి వ్యవస్థ అధ్వానంగా మారడంతో అపరిశుభ్రత తాండవిస్తుంది.

Updated Date - 2022-12-16T00:35:05+05:30 IST