రహదారి భద్రత.. ఉమ్మడి బాధ్యత
ABN , First Publish Date - 2022-12-15T03:11:00+05:30 IST
రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు సంబంధిత శాఖలు, స్వచ్చంద సంస్థలు..
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఉన్నతస్థాయి కమిటీ తీర్మానం
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి విశ్వరూప్
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు సంబంధిత శాఖలు, స్వచ్చంద సంస్థలు.. ప్రజల సహకారంతో సమష్టిగా కృషి చేయాలని రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించాలనే అంశంపైౖ విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో బుధవారం ఆయన సమీక్షించారు. రవాణా, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పాఠశాల విద్య, ఏపీఎస్ ఆర్టీసీ, పోలీస్ ఉన్నతాధికారులతో శాఖల వారీగా చర్చించిన మంత్రి ప్రమాదాలకు కారణాలు తెలుసుకున్నారు. అధికారులు చర్యలు చేపడుతున్నా ప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణం తెలుసుకుని సరిదిద్దాలన్నారు. తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఝార్ఖండ్‌లలో ప్రమాదాలు గణనీయంగా తగ్గటానికి ఆయా రాష్ట్రాల్లో రహదారి భద్రతపై చేపడుతోన్న చర్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండాలని, అన్ని శాఖలకు అనుకూలంగా ఐరాడ్‌ను తీర్చిదిద్దాలని కమిటీ నిర్ణయించింది. ప్రమాదాలు జరిగినప్పుడు లారీలను సీజ్ చేసి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్న ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తిపై స్పందించిన కమిటీ ఇకపై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని విడుదల చేయాలని తీర్మానించింది. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు ఎం.టి. కృష్ణబాబు, ప్రద్యుమ్న, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, అడిషనల్ డీజీ కె.టి. ఉజాలా, రవాణా శాఖ ఉప కమిషనర్ ప్రసాద రావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.