డెలి‘వర్రీ’

ABN , First Publish Date - 2022-10-14T06:09:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇంటింటికీ రేషన్‌ విధానం వీరికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.

డెలి‘వర్రీ’

మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌ విధానంతో తిప్పలు

అరకొర సరుకులతో లబ్ధిదారులకు టోకరా

నామమాత్రపు పంపిణీతో సగం మందికి డుమ్మా

బయటి పనులకు వెళ్లే వారికి మరిన్ని ఇబ్బందులు

సమయానికి లేరంటూ చౌక బియ్యం ఎగవేత 

ఆదాయం మరిగి అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లు, వాహనదారులు


- ఈనెల రేషన్‌ సరఫరా చేసేందుకు ఒక బజారుకు ఎండీయూ వాహనం వచ్చింది. ఆ బజారులో ఒక చోట వాహనం నిలిపారు. ఆ బజారులో వాళ్లంతా బియ్యం కోసం బారులు తీరారు. వారిలో కొంతమందికి బియ్యం ఇచ్చేసరికి వాహనంలో బియ్యం అయిపోయాయి. దీంతో మిగిలినవారికి మళ్లీ వచ్చి ఇస్తామని చెప్పి వాహనం వెళ్లిపోయింది. అంతే తిరిగి వాహనం రాలేదు. లబ్ధిదారులకు బియ్యం రాలేదు. 

- ఉమ్మడి జిల్లాలోని ఒక డిపో పరిధిలో జరిగిన సంఘటన.


- గుంటూరు నగరంలోని ఒక పేటకు రేషన్‌ సరఫరా వాహనం వచ్చింది. ఆ పేటలో వారంతా రేషన్‌ కోసం వాహనం దగ్గరకు వెళ్లారు. వాహనం వచ్చే సమయానికి కొంతమంది పనులకు వెళ్లారు. వాళ్ల పిల్లలు చదువుకోవడానికి బడులకు వెళ్లారు. బయోమెట్రిక్‌ వేసేందుకు ఎవరూ లేరు. ఈ కారణంగా ఆ కుటుంబాల వారు ఈనెల రేషన్‌ కోల్పోయారు. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి. 

- గుంటూరులోనే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.


గుంటూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇంటింటికీ రేషన్‌ విధానం వీరికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం చెప్పినట్లు ఇంటింటికీ బియ్యం సరఫరా చేయకపోగా వీధి చివరన వాహనం పెట్టి లబ్దిదారులను గంటలు గంటలు నిలబెట్టడం లబ్ధిదారులకు అదనపు సమస్యగా మారింది. గతంలో సమీపంలో ఉన్న రేషన్‌ షాపుకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి బియ్యం తెచ్చుకునే వీలుండేది. ఇప్పుడు రేషన్‌ 


సరఫరా వాహనం ఎప్పుడు వస్తుందా అని ఒకటో తేదీ నుంచి ఎదురు చూడాల్సి వస్తోంది. వాహనం వచ్చే సమయానికి లేకపోతే రేషన్‌ కోల్పోవాల్సిందే. ఇలా ప్రతి నెలా కొన్ని వేల కుటుంబాలు రేషన్‌ కోల్పోతున్నారు. పోనీ.. రేషన్‌ వదిలేసుకుని పనికి వెళదామా అంటే కార్డు రద్దు చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

బియ్యం మిగిల్చుకునేందుకు అడ్డదార్లు..

పనులకు వెళ్లేవారు ఉండని కారణంగా బియ్యం మిగులుతున్న విషయాన్ని గుర్తించిన మొబైల్‌ వాహనదారులు, రేషన్‌ డీలర్లు దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. ప్రతి నెలా ఫలానా వీధికి ఫలానా రోజు వస్తారన్న గ్యారంటీ లేకుండా మార్చి మార్చి వెళుతున్నారు. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక పనులకు వెళ్లినవారు రేషన్‌ నష్టపోతున్నారు. దీనికి తోడు వాహనంలో తక్కువ సరుకులు తీసుకు వచ్చి కొందరికి సరఫరా చేసి, అయిపోయి.. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోతున్నారు. తిరిగి ఆ వీధికి వెళ్లకుండా తప్పుకొంటున్నారు. ఫలితంగా లబ్దిదారులు రేషన్‌ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డీలర్లు, వాహనదారులు కుమ్మక్కై ఒకరిపై ఒకరు నెపం చూపి లబ్దిదారులను పదే పదే తిప్పుతున్నారు. విసిగి వేసారిపోతున్న లబ్ధిదారులు రేషన్‌ను వదులుకుంటున్నారు.  

గత విధానమే మేలంటున్న లబ్ధిదారులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 14,72,500 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి తోడు ఇటీవల ఏర్పాటైన బాపట్ల జిల్లాలో భాగమైన చీరాల డివిజన్‌ జిల్లా నుంచి మరో 2,29,448 రేషన్‌ కార్డులు జతయ్యాయి. వీటి ద్వారా మూడు జిల్లాల్లో 45 లక్షల మంది రేషన్‌ పొందుతున్నారు. అందుకోసం 3,200 రేషన్‌ డిపోలు ఉండేవి. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు పదిహేను రోజులపాటు రేషన్‌ ఇచ్చే విధానం ఉండడంతే ఎప్పుడు వీలైతే అప్పుడు లబ్ధిదారులు సమీపంలోని రేషన్‌ డిపోలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. గత ప్రభుత్వం రేషన్‌ పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పక్క జిల్లాల నుంచి వలస వచ్చినవారికి కూడా సమీపంలోని రేషన్‌ షాపుల ద్వారా రేషన్‌ కోల్పోయే ఇబ్బంది ఉండేది కాదు. దీంతో లబ్ధిదారులు ఈ విధానం పట్ల చాలా సంతృప్తిగా ఉండేవారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసి ప్రవేశపెట్టిన డోర్‌ డెలివరీ విధానం అక్రమాలకు ఆదాయంగా, లబ్ధిదారులకు ప్రాణ సంకటంగా మారింది. 


Updated Date - 2022-10-14T06:09:16+05:30 IST