పిడుగుపాటుకు వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-10-07T05:51:09+05:30 IST
పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
మాచవరం, అక్టోబరు6: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కోటయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహంకాళి చంద్రశేఖర్ (42) భార్య శివపార్వతి, మరికొంతమంది కూలీలతో కలసి మిరపమొక్కలు నాటేందుకు పొలం వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావటంతో చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడి చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరొక వ్యక్తి స్పృహతప్పి పడిపోవటంతో పిడుగురాళ్ల వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి నలుగురు పిల్లలు ఉన్నారు.
పిడుగుపాటుకు పేలిన సెల్‌ఫోన్
పిడుగురాళ్ల, అక్టోబరు6: పిడుగుపడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలి వ్యక్తి గాయాలపాలైన ఘటన బుధవారం పిడుగురాళ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన వడ్డెంగుంట సాంబయ్య గేదెలను తోలుకుని పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడింది. దీంతో చొక్కా జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలిపోయింది. సమీప పొలాల్లోని రైతులు సాంబయ్యను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.