వీడని వాన

ABN , First Publish Date - 2022-10-07T05:54:26+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు నగరంలోని జనజీవనం అస్తవ్యస్తం అయింది.

వీడని వాన
తెనాలిలో జలమయమైన రోడ్లు

లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం

పొంగా పొర్లుతున్న ప్రధాన కాలువలు, డ్రైన్లు

వర్షాలకు అన్నదాతల్లో ఆందోళన

 

గుంటూరు(కార్పొరేషన్‌), అక్టోబరు6: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు నగరంలోని జనజీవనం అస్తవ్యస్తం అయింది. బుధ, గురువారాల్లో కురిసిన భారీవర్షాలకు నగరంలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. డ్రెయిన్లలో వర్షపు నీరు పారుదల కాక ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయింది.   కొరిటెపాడు, అరండల్‌పేట, విద్యానగర్‌, పట్టాభిపురం, నల్లచెరువు, మూడువంతెనలు, కంకరగుంట ఆర్‌యూబీ వద్ద, నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డు, అమరావతి రోడ్డు శివారు ప్రాంతాల్లో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి.

 పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో కురిసిన భారీవర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొన్నూరు మండలంలో ప్రధాన రహదారులు, ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లు కాలువలు, చెరువులను తలపించాయి. మండల కేంద్రమైన చేబ్రోలులో భారీ వర్షంతో జలజీవనం అస్తవ్యస్థంగా మారింది. కొత్తరెడ్డిపాలెంలోని జగనన్న కాలనీ నీటమునిగింది. రహదారుల్లో అడుగుమేర వర్షపు నీరు చేరింది. వడ్లమూడి గ్రామంలో అన్నపూర్ణనగర్‌లో గృహాల్లోకి నీరు చేరింది.  

 పెదనందిపాడు మండలంలో వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప పంటలను వర్షపు నీరు ముంచెత్తాయి, వర్షపునీరు రోజుల తరబడి నిల్వ ఉండడంతో పంటలకు తెగుళ్లు ఆశించి దెబ్బతినే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. 

  ప్రత్తిపాడులో గతంలో ఎన్నడూలేని విధంగా వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు ప్రధాన రహదారితో పాటు మండలంలోని కొన్ని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మండలంలోని పాతమల్లాయపాలెం, వంగిపురం, తిమ్మాపురం ప్రాంతాలలోని వేలాది ఎకకాలు నీట మునిగి పోయాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో పంటలు చేతికందని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిమ్మాపురంలో సుమారు 50 గృహాలు నీట మునిగి పోయాయి. ఇంటిలో నుంచి ఒక్క సామాను కూడా తెచ్చుకోవడానికి వీలు లేకుండా పోయంది. ఇంట్లో నిత్యావసరాలు కూడా పనికిరాకుండా పోయాయి.  

అల్పపీడన ప్రభావంతో తెనాలి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెనాలి గంగానమ్మపేట, కొత్తపేటలోని తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డు, బుర్రిపాలెం రోడ్డు, చినరావూరు రోడ్డులోని చిట్టాంజనేయస్వామి ఆలయం రోడ్డు, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, కఠెవరం కాలువకట్ట ప్రాంతం ఇలా పలు ప్రాంతాలు వర్షపునీటితో నిండి పోయాయి. తెనాలి - అంగలకుదురు- గుంటూరు ప్రధాన రోడ్డు, తెనాలి - కొలకలూరు - గుంటూరు రోడ్డు, తెనాలి - చందోలు, తెనాలి - మంగళగిరి వంటి ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి వాహన ప్రయాణం నరకంగా మారింది.   

Read more