క్వారీయింగ్‌కు.. కప్పం

ABN , First Publish Date - 2022-12-07T01:17:30+05:30 IST

లారీకి రూ.50 వేలు చెల్లించండి.. నెల మొత్తం ఎక్కడైనా తవ్వుకోండి.. ఎంతకైనా అమ్ముకోండి. అడిగేవారు ఉండరు.. అడ్డుకునేవారు ఉండరు.. ఎక్కడైనా ఎవరైనా అడ్డుకుంటే మేం చూసుకుంటాం.. ఎటువంటి అనుమతులు అవసరం అవసరం లేదు..

క్వారీయింగ్‌కు.. కప్పం
నరసరావుపేట మండలం కాకాని చెరువు వెనుక ప్రాంతంలో మైనింగ్‌

నరసరావుపేట, డిసెంబరు 6: లారీకి రూ.50 వేలు చెల్లించండి.. నెల మొత్తం ఎక్కడైనా తవ్వుకోండి.. ఎంతకైనా అమ్ముకోండి. అడిగేవారు ఉండరు.. అడ్డుకునేవారు ఉండరు.. ఎక్కడైనా ఎవరైనా అడ్డుకుంటే మేం చూసుకుంటాం.. ఎటువంటి అనుమతులు అవసరం అవసరం లేదు.. అధికార్టీకి కప్పం కడితే చాలన్నట్లుగా క్వారీయింగ్‌ జరుగుతుంది. కప్పం కట్టిన వారికి నరసరావుపేటలో అధికార పార్టీ నేత ఒకరు మట్టి అక్రమ తవ్వకాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 20 లారీలకు డబ్బు చెల్లించి మట్టిని విక్రయిస్తున్నారని అధికార పార్టీలోని కొందరు నేతలే ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో కోటప్పకొండకే పరిమితమైన మట్టి తవ్వకాలు నియోజకవర్గం మొత్తం విస్తరించింది. ఎక్కడి పడితే అక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు మట్టితో జేబులు నింపుకుంటున్నారు. పల్నాడు జిల్లా కేంద్ర పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. నరసరావుపేట మండలం గోనేపూడి, ములకలూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిగాయి. ఇది ప్రస్తుతం కొత్తపాలేనికి వ్యాపించింది. కాకాని గ్రామ చెరువు ప్రాంతంలో కూడా భారీగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. కోటప్పకొండ, గోనేపూడి, కాకాని చెరువు ప్రాంతంలో మండల స్థాయి వైసీపీ నేత ఒకరు మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. గోనేపూడి వద్ద మట్టి తవ్వకాలపై విజిలెన్స్‌ తనిఖీలు చేసి రెండు లారీలు, ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి నోటీసులు ఇచ్చినా ఏమాత్రం భయం లేకుండా సదరు వ్యక్తి కాకాని చెరువు సమీపంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు వైసీపీ నేతలే చెబుతున్నారు. రొంపిచర్ల మండలం అన్నవరం సమీపంలోని పవర్‌ గ్రిడ్‌ స్టేషన్‌ ఎదుట పెద్ద ఎత్తున మట్టి దందా సాగుతోంది. ప్రధాన రహదారికి ఆనుకుని మట్టి తవ్వకాలు జరుగుతున్నా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటంలేదు. ఈ ప్రాంతంలో లక్షకు పైగా క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వి విక్రయించినట్లు సమాచారం. అధికార పార్టీ మండల స్ధాయి నేత ఒకరు ప్రస్తుతం ఈ ప్రాంతంలో మట్టి తవ్వి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదే మండలంలోని నల్లగార్లపాడు ప్రాంతంలో కూడా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములనే మట్టి తవ్వకాలకు వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల అసైన్డ్‌ భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించుకునే అవకాశాన్ని వైసీపీలో ఒక వర్గానికే అప్పగించారన్న విమర్శలు ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై పార్టీలోని ఒక వర్గం గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ ఆదాయానికి రూ కోట్లలో గండి

అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఆదా యానికి భారీగా గండి పడుతున్నది. నియోజకవర్గంలో జరిగిన, జరుగు తున్న మైనింగ్‌ వల్ల దాదాపు 3 నుంచి రూ.4 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయా న్ని కోల్పోయినట్లు అంచనా. మైనింగ్‌, విజిలెన్స్‌ శాఖలకు అక్రమ క్వారీ యిం గ్‌పై ఫిర్యాదులు అందుతున్నా సదరు అధికారులు చర్యలు తీసుకునే సాహ సం చేయడంలేదు. అధికార పార్టీ నేత ల నుంచి ఒత్తిళ్లులు, బెదిరింపులు వస్తుండటంతో చేసే దేమీ లేక సదరు అధికారులు చేతులెత్తేశారు.

వెంకటేశ్వరరెడ్డికి రూ16,65,000 జరిమానా

నరసరావుపేట మండలం గోనేపూడి సమీపంలో అసైన్డ్‌ భూమిలో మట్టి తవ్వకాలపై మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు ఎట్టకేలకు చర్యలు తీసు కున్నారు. తనిఖీల సందర్భంగా రెండు లారీలను, ఎక్స్‌కవేటర్‌ను సాధీనం చేసుకుని నరసరావు పేట లోని ఆర్టీసీ గ్యారేజ్‌కు తరలించారు. జక్కిరెడ్డి వెం కటేశ్వరరెడ్డి అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశామని విజిలెన్స్‌ స్క్వాడ్‌ ఇన్‌ఛార్జ్‌ టీ కొండారెడ్డి మంగళ వారం తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి తవ్విన ప్రాంతంలో కొలతలు తీశామని నిబంఽధనల ప్రకారం రూ16,65,000 జరిమానా చెల్లించాలని నోటీసు అందజేశామన్నారు. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అధి కార పార్టీ మండల స్ధాయి నేత వెంకటేశ్వరెడ్డిపై చర్యలు తీసుకోవద్దంటూ సదరు అధికారిపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

======================================================================

Updated Date - 2022-12-07T01:17:33+05:30 IST