సర్పంచ్‌లపై.. సాధింపు

ABN , First Publish Date - 2022-10-08T05:50:04+05:30 IST

పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించకపోగా.. కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు జమ చేసుకోవడంపై సర్పంచ్‌లు నిరసన బాటపట్టారు.

సర్పంచ్‌లపై.. సాధింపు
మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో మూడు జిల్లాల సర్పంచ్‌ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, ఉపాధ్యక్షుడు షేక్‌ అల్లాభక్షు

నిధులు అడిగితే నిర్బంధం

ప్రథమ పౌరుల ఉద్యమంపై ఉక్కుపాదం

తాడేపల్లిలో నిరసనకి వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు

సర్పంచ్‌లకు నోటీసులు.. అరెస్టు చేసి స్టేషన్లకు తరలింపు

ఉమ్మడి జిల్లా పంచాయతీ నిధులు రూ.81 కోట్లు దారిమళ్లింపు

నరసరావుపేట, అక్టోబరు 7: పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించకపోగా.. కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు జమ చేసుకోవడంపై సర్పంచ్‌లు నిరసన బాటపట్టారు.  పంచాయతీ ఖాతాలకు జమ కావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించుకోవడంపై రోడ్డెక్కారు. ఆయా నిధుల కోసం ఉద్యమ బాట పట్టిన సర్పంచ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసనకు సర్పంచ్‌లు పిలుపిచ్చారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సర్పంచ్‌లు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆందోళనకి వెళ్లొద్దంటూ పోలీసులు సర్పంచ్‌లకు నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగని పోలీసులు పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో సర్పంచ్‌లను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. మొత్తంమీద ప్రథమ పౌరుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయినా ఆంక్షలను లెక్క చేయకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు సర్పంచ్‌లు తాడేపల్లికి చేరుకోగా అక్కడ వారి అరెస్టుల పర్వం కొనసాగింది. నిధుల్లేక కనీసం పారిశుధ్య పనులను నిర్వహించలేని దుస్థితి పంచాయతీల్లో నెలకొంది. వర్షాలతో అడుగంటిన పారిశుధ్య సమస్య పరిష్కారానికి పంచాయతీలకు నిధులు జమ చేయాలని సర్పంచ్‌ల సంఘాలు కోరినా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ఉద్యమ బాట పట్టగా నిరసనకు అనుమతి లేదంటూ మాచవరం మండల సర్పంచ్‌లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులపై సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు షేక్‌ అల్లాభక్షు ఖండించారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థతో పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, అంతటితో ఆగక కేంద్ర నిధులపైన కన్నేయడం దుర్మార్గమని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి పనులను కూడా సచివాలయాలు ప్రతిపాదించే పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. గతంలో పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేసిన అనంతరం ప్రగతి పనులు నిర్వహించేవారని, అందుకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని పాలక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారనున్నారంటున్నారు. 

సర్పంచ్‌లను అర్టెసు దారుణం

నిధుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచ్‌లను తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద అరెస్టు చేయడం దుర్మార్గమని పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు లేక పంచాయతీలు దీనావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు జమ చేయకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. 

కేంద్ర ఉత్తర్వులు తుంగలోతొక్కి..

పంచాయతీల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నుంచి ఎప్పటికప్పుడు విడతల వారీగా నిధులను విడుదల చేస్తుంటుంది. 15వ ఆర్థిక సంఘం నుంచి ఇప్పటికి రెండు విడతల్లో నిధులను విడుదల చేసింది. అయితే ఆయా నిధులు రాష్ట్ర పభుత్వం వినియోగించుకున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యను కట్టడి చేసేందుకు పంచాయతీలు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. మూడో విడత నిధులను స్థానిక సంస్థల ఖాతాలకు కేంద్రం జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఆర్థిక సంఘం నిధులు రూ.81 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఈ నిధులు నేటి వరకు పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు బదిలీ చేసుకుంది.  పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కేసిందని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజల మౌళిక వసతులకు సంబంధించిన పనులను చేపట్టాలని కేంద్రం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జలవనరులను పెంపొందించుకునేందుకు చెరువులు, కుంటలు అభివృద్ధి, చెక్‌డ్యాంల నిర్మాణం, ఇంకుడు గుంతలు ఏర్పాటు, తాగునీటి పథకాల అభివృద్ధి, పారిశుధ్యం మెరుగుదల, మరుగుదొడ్ల నిర్మాణం, వ్యర్థాల నిర్వాహణ తదితర పనులకు ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో పాధాన్యం ఇవ్వాలని సూచించింది. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్‌ ఛార్జీల కింద జమ చేసుకున్న 14, 15 ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు తిరిగి జమచేయాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. 


       

Read more