దేవాలయ స్థలంలో ప్రభుత్వ నిర్మాణాలొద్దు
ABN , First Publish Date - 2022-03-05T05:40:10+05:30 IST
స్థానిక కోదండ రామాలయం, శివాలయం దేవస్థానాల మధ్య చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రతిపాదనను విరమించుకోవాలని శుక్రవారం దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు, గ్రామస్థులు పాతబస్టాండ్ సెంటర్లో నిరసన కార్యాక్రమం చేపట్టారు.
పెదనందిపాడులో గ్రామస్తుల ఆందోళన
పెదనందిపాడు, మార్చి4: స్థానిక కోదండ రామాలయం, శివాలయం దేవస్థానాల మధ్య చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రతిపాదనను విరమించుకోవాలని శుక్రవారం దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు, గ్రామస్థులు పాతబస్టాండ్ సెంటర్లో నిరసన కార్యాక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి సభ్యులు, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ మాట్లాడుతూ దైవకార్యాలకు ఉపయోగించే ఈ స్థలంలో గతంలో సచివాలయ భవనం కట్టాలనుకున్నారని, స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఆర్బీకేలు నిర్మించడానికి పూనుకున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కొంత మంది కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. రెండు దేవాలయాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కులమతాలు, పార్టీలకు అతీతంగా పుణ్య కార్యక్రమాలతో పాటు అన్నదానాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన పంచాయతీ ఇష్టానుసారంగా తీర్మానాలు చేసి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అక్రమంగా కట్టడాలు ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించేంత వరకు నిరసన విరమించేది లేదని మహిళలు ముక్తకంఠంతో తెలిపారు. ఎస్ఐ డి.అశోక్ అక్కడికి చేరుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో నిరసన విరమించారు.