మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-04-05T06:21:10+05:30 IST

దళిత యువకుడి మిస్సింగ్‌ కేసులో న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తెనాలిలో పెద్ద ఎత్తున సోమవారం ధర్నా నిర్వహించారు.

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
ఎమ్మార్పీఎస్‌ నాయకులకు హామీ ఇస్తున్న డీఎస్పీ స్రవంతిరాయ్‌

తెనాలిలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ధర్నా

మృతదేహాన్ని అప్పగిస్తానని డీఎస్పీ హామీ

తెనాలి క్రైం, ఏప్రిల్‌ 4: దళిత యువకుడి మిస్సింగ్‌ కేసులో న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తెనాలిలో పెద్ద ఎత్తున సోమవారం ధర్నా నిర్వహించారు. మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్‌ (30) అదృశ్యంలో పోలీసుశాఖ నిర్లక్ష్యం, గోప్యతపై మార్కెట్‌ సెంటర్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆందోళనకు దిగారు. గత నెల 20వ తేదీ నుంచి రవికిరణ్‌ కనిపించడంలేదని అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు సమాచారం అందించినా ఇప్పటి వరకు సరైన సమాధానం లేదని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అండదండలతో కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేశారని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, శవాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో గుంటూరు, విజయవాడ, చందోలు మార్గంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో డీఎస్పీ స్రవంతిరాయ్‌ ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు రోజుల్లో కిరణ్‌ మృతదేహాన్ని అప్పగిండానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కేసు విషయంలో న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. దాంతో ఆందోళనను నాయకులు విరమించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఉన్నం ధర్మారావు, కూచిపూడి సత్యం, ఎటుకూరి విజయ్‌కుమార్‌, కాళహస్తి గోపి, సుద్దపల్లి నాగరాజు, కె.రమేష్‌, తాతాబాబు తదితరులు పాల్గొన్నారు.  


Read more