అంతా మాయే!

ABN , First Publish Date - 2022-09-30T05:48:25+05:30 IST

వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అధికారులు సైతం తలొగ్గుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతా మాయే!
గనికపూడిలో వక్ఫ్‌బోర్డు భూమిలో నిర్మాణం పూర్తయిన సచివాలయ భవనం

వక్ఫ్‌బోర్డు భూమిలో ప్రభుత్వ కట్టడాలు

నాడు తనదంటూ భూమిని రాసిచ్చిన గ్రామ వైసీపీ సర్పంచ్‌

సరిదిద్దకపోగా మద్దతుగా నిలిచిన అధికారులు

వక్ఫ్‌బోర్డు నుంచి వచ్చిన లేక బుట్టదాఖలు

భవనాన్ని  ప్రారంబించనున్న సుచరిత


ప్రత్తిపాడు, సెప్టెంబరు 29: వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అధికారులు సైతం తలొగ్గుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారు చెప్పిందే వేదంలా కాని పనిని సైతం అలవోకగా చేసేస్తున్నారు. వారి అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా గనికపూడి గ్రామంలో సచివాలయ భవనంతో పాటు పలు కార్యాలయాలు  రూపుదిద్దుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.

 మండలంలోని గనికపూడిలో సచివాలయ భవనంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం కోసం గతంలో స్థల పరిశీలన చేశారు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్‌ తన స్థలం అంటూ 20 సెంట్ల వక్ఫ్‌బోర్డు  భూమిని పంచాయతీకి రాసిచ్చారు. ఈ విషయం అప్పల్లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. తనది కాదని భూమిని సర్పంచ్‌ రాసిచ్చి మోసం చేశారని నాడు అధికారులు నిర్ధారించారు. ఆ తరువాత వైసీపీకి చెందిన నేతలు, అప్పుడు హోం మంత్రిగా ఉన్న సుచరిత ఏం చేశారో ఏమో కాని తిరిగి కట్టడాలు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఈ భవనాలను అక్టోబరు 1న సుచరిత చేతుల మీదగా ప్రారంభించనున్నారు. ఈ విషయంలో ఏ అధికారి కూడా నోరు మెదపని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ప్రత్తిపాడు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం అనంతరం ఇదే విషయాన్ని పీఆర్‌ ఏఈని వివరణ కోరగా డీఆర్‌వో కట్టమని చెప్పాడని, అందుకే తాము బిల్డింగ్‌ను పూర్తి చేశామంటూ సమాధానం చెప్పారు. 

ఆపాలంటూ వక్ఫ్‌బోర్డు నుంచి కోరినా.. 

గనికపూడి వక్ఫ్‌బోర్డు భూమిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను ఆపాలంటూ  రాష్ట్ర  వక్ఫ్‌బోర్డు అధికారులు జిల్లా అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. స్టేట్‌ వక్ఫ్‌బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎల్‌.అబ్దుల్‌ ఖదీర్‌ ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులందరినీ లిఖితపూర్వకంగా కోరు. అయితే ఈ లెటర్‌ను అధికారులు బుట్టదాఖలు చేసినట్టు తెలుస్తోంది. కేవలం వైసీపీ నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసం వక్స్‌బోర్డు జిల్లా అధికారులు సైతం మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన ముస్లిం నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2022-09-30T05:48:25+05:30 IST